AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగా, యమునా జలప్రళయం.. గంటల్లోనే భారీగా పెరిగిన నీటిమట్టం.. రెడ్ అలర్ట్ జారీ!

ప్రయాగ్‌రాజ్‌లో ఎడతెరిపి లేని వర్షాలతో గంగా, యమునా నదుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. గంటల్లోనే గణనీయంగా పెరిగిన నీటి స్థాయిలు తీవ్ర వరద ముప్పును సూచిస్తున్నాయి. అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గంగా, యమునా జలప్రళయం.. గంటల్లోనే భారీగా పెరిగిన నీటిమట్టం.. రెడ్ అలర్ట్ జారీ!
Prayagraj Flood Alert
Balaraju Goud
|

Updated on: Aug 31, 2026 | 9:18 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో రెండు నదుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతుండటంతో వరద ముప్పు మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు రోజుల్లోనూ నదుల నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆదివారం (ఆగస్టు 30) కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే గంగా, యమునా నదుల నీటిమట్టాలు 26 నుంచి 40 సెంటీమీటర్ల మేర పెరిగాయి. గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం దాదాపు ఒక మీటరు వరకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రమాద స్థాయి 84.734 మీటర్లు కాగా, హెచ్చరిక స్థాయి 83.73 మీటర్లుగా ఉంది.

ప్రస్తుతం గంగా, యమునా నదుల నీటిమట్టాలు హెచ్చరిక స్థాయికి దిగువనే ఉన్నాయి. గంగానది హెచ్చరిక స్థాయికి సుమారు 1.57 మీటర్లు, యమునా నది 1.71 మీటర్ల దిగువన ప్రవహిస్తున్నాయి. అలాగే రెండు నదుల నీటిమట్టాలు ప్రస్తుతం ప్రమాద స్థాయి కంటే చాలా దిగువన ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నదీ కట్టలు కూడా సురక్షితంగా ఉన్నాయని పరిపాలన యంత్రాంగం స్పష్టం చేసింది.

అయితే నీటిమట్టం పెరుగుతున్న వేగం ఆందోళనకు కారణమవుతోంది. సంగమ ప్రాంతంతో పాటు నదీ తీర ప్రాంతాల్లో అధికారులు నిఘాను పెంచారు. సున్నితమైన ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గంగా నది వెంబడి ఉన్న కొన్ని రహదారులు ఇప్పటికే నీటమునిగాయి. డ్రైన్ల ద్వారా పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశిస్తుండగా, కొన్ని గ్రామాల వైపు కూడా నీరు నెమ్మదిగా చేరుతోంది.

మరోవైపు రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితి మరింత దిగజారితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తక్షణ ప్రమాదం లేకపోయినా, గంగా, యమునా నీటిమట్టాలు ఇదే వేగంతో పెరిగితే ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు మరింత తీవ్రం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..

Follow Us