Prashant Kishor: చెప్పు విసిరారని 15 ఏళ్లుగా రోడ్డు వేయలేదు.. సీఎం నితీశ్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్‌లో 3500 కిలో మీటర్ల పాదయాత్ర చేపడుతున్న ఆయన.. మరోసారి సీఎం నితీశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Prashant Kishor: చెప్పు విసిరారని 15 ఏళ్లుగా రోడ్డు వేయలేదు.. సీఎం నితీశ్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణ
Prashant Kishore
Image Credit source: TV9 Telugu

Updated on: Nov 05, 2022 | 3:33 PM

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్‌లో 3,500 కిలో మీటర్ల పాదయాత్ర చేపడుతున్న ఆయన..  సీఎం నితీశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 15 ఏళ్ల క్రితం ర్యాలీలో తన స్టేజ్‌పైకి ఓ వ్యక్తి షూ విసిరిన కారణంగా ఆ ప్రాంత ప్రజలపై నితీశ్ కుమార్ కక్ష కట్టారని ఆరోపించారు. అందుకే వెస్ట్ చంపరాన్ జిల్లాలోని నావల్‌పూర్ నుంచి జిల్లా కేంద్రం బేటియాను కనెక్ట్ చేసే 32 కిలో మీటర్ల రోడ్డు మార్గాన్ని ఇప్పటికీ నిర్మించలేదని ధ్వజమెత్తారు. జన్ సంవాద్(జన్ సురాజ్) కార్యక్రమంలో భాగంగా యోగపట్టి వద్ద స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు దుస్థితి గురించి అడగ్గా.. స్థానికలే ఈ విషయాన్ని తనకు చెప్పారని వెల్లడించారు. రోడ్డు దుస్థితి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆ మార్గంలో తాను పాదయాత్ర చేస్తుండగా దుమ్ము కారణంగానే తాను చాలాసేపు దగ్గుతూనే ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మొదటి సారి ఆ మార్గంలో నడిచే తన పరిస్థితే ఇలా ఉంటే.. స్థానికుల పరిస్థితి మరెంత దయనీయమోనంటూ వ్యాఖ్యానించారు. స్థానికుల్లో చాలా మంది టీబీ, ఆస్తమా వ్యాధుల బారినపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

తాను ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదని.. ఓట్ల కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఒక్క సంఘటన కారణంగా నితీశ్ కుమార్ పలు గ్రామాల ప్రజలను ఇబ్బందులపాలు చేయడం దారుణమంటూ మండిపడ్డారు. ఎవరో ఒక వ్యక్తి తన స్టేజ్‌పై షూ విసిరారన్న కారణంగా ఆ ప్రాంత ప్రజలపై 15 ఏళ్లుగా కక్ష సాధిస్తారా? అంటూ నితీశ్‌‌ను ప్రశ్నించారు. స్థానిక గ్రామాల ప్రజలు మేల్కొంటోనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన సూచించారు. మీకోసం కాకపోయినా మీ పిల్లల భవిష్యత్తు పట్ల అక్కర చూపించాలని హితవుపలికారు.

ఇవి కూడా చదవండి

అయితే నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ఆరోపణలను జేడీయు జాతీయ ప్రధాన కార్యదర్శి అఫకీ అహ్మద్ తోసిపుచ్చారు. నితీశ్ కుమార్ కేబినెట్‌లో ఎక్కువ కాలం బీజేపీ వ్యక్తే రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. అయితే రోడ్డు నిర్మాణంలో వైఫల్యానికి బీజేపీని ప్రశాంత్ కిషోర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీహార్ రాష్ట్రం నితీశ్ కుమార్ పాలనలో పరివర్తన చెందుతోందన్నారు. నితీశ్ కుమార్‌పై నిరాధారణ ఆరోపణలు చేయడం ప్రశాంత్ కిషోర్ మానుకోవాలని హితవుపలికారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి