AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌-పీకే సుదీర్ఘ మంతనాల వెనుక మర్మమేమటి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గులాబీ అధినేత సపోర్ట్ ఇస్తారా?

ఇప్పుడు దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ జవసత్వాలు కలిగించేందుకు, పునరుత్తేజాన్ని తెచ్చేందుకు సిద్ధమయ్యారు పీకే. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు పీకే వంటి వ్యూహకర్త అవసరం కావడమే ఓ విషాదం.

కేసీఆర్‌-పీకే సుదీర్ఘ మంతనాల వెనుక మర్మమేమటి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గులాబీ అధినేత సపోర్ట్ ఇస్తారా?
Pk Cm Kcr
Balu
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 24, 2022 | 7:17 PM

Share

Telangana Politics: ఎన్నికల్లో గెలుపోటములు పోటీ చేసిన అభ్యర్థుల బలాబలాల మీద ఆధారపడి ఉంటాయి. అభ్యర్థి గుణగణాలు ప్రధానమవుతాయి. చెప్పే మాటలు, ఇచ్చే వాగ్దానాలు బలంగా పని చేస్తాయి. ఇప్పుడలా కాదు పకడ్బందీ వ్యూహం అవసరమవుతోంది. ఫలితంగా పార్టీలను విజయతీరాలకు తీసుకెళ్లే వ్యూహకర్తలకు పని దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor )పాపులరయ్యారు. ఆయన పని చేసి పెట్టిన పార్టీలన్నీ దాదాపుగా గెలిచాయి. అందుకే అయనంటే అంత గురి. ఇప్పుడు సమస్యల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీతోనూ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌(Trs) పార్టీతోనూ ఉండటం. కేంద్రంలోనేమో కాంగ్రెస్‌(Congress) గెలుపు కోసం పని చేస్తున్న పీకే తెలంగాణలోనేమో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేస్తున్నారు. దానర్థం కాంగ్రెస్‌ ఓటమి కోసమని వేరే చెప్పనక్కర్లేదు. 2013లో పీకే తెరమీదకు వచ్చారు. నరేంద్రమోదీకి ప్రధానమంత్రి పదవి దక్కడంలో పీకే పాత్రను తోసిపుచ్చలేం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత పీకే పేరు మారుమోగింది. ఆ విజయంలో పీకే వ్యూహాలు బాగా పని చేశాయి. సోషల్‌ మీడియాను, లేటెస్ట్‌ టెక్నాలజీని అందిపుచ్చుకున్న పీకే వాటిని సద్వినియోగం చేసుకుని ఎన్నికల వ్యూహాన్ని రచించారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకమైన వ్యూహాన్ని రచిస్తారు. ప్రజల ఆలోచనా విధానాన్ని, ప్రభుత్వం పట్ల వారికున్న అభిప్రాయాలను పసిగట్టడంలో దిట్ట.

ఇప్పుడు దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ జవసత్వాలు కలిగించేందుకు, పునరుత్తేజాన్ని తెచ్చేందుకు సిద్ధమయ్యారు పీకే. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు పీకే వంటి వ్యూహకర్త అవసరం కావడమే ఓ విషాదం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్త అవసరం ఎంతో ఉంది. ఓ వైపు కాంగ్రెస్‌ విముక్త భారత్‌ కోసం మోదీ-షా ద్వయం కంకణం కట్టుకుంటే మరోవైపు అస్థిత్వాన్ని చాటుకోవడం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ 2.0 పేరుతో సోనియా గాంధీకి, రాహుల్‌గాంధీకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు ప్రశాంత్‌ కిశోర్‌. కేంద్రంలో యూపీఏను అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాలను వారికి తెలిపారు. 2024లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి రావాలంటే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? పార్టీలో ఏఏ మార్పులు చేపట్టాలి? అన్న విషయాలతో పాటు అనేక ఆలోచనలను అధినాయకత్వంతో పంచుకున్నారు పీకే. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిదని సూచించారు. తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలన్నారు. తెలంగాణలో ఎందుకు ఒంటరిగా పోటీ చేయమంటున్నారంటే ఇక్కడ టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తున్నారు పీకే. ఓవైపు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తూ, ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నించడమే టీ-కాంగ్రెస్‌ నేతలను అయోమయంలోకి నెట్టేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ ప్రశాంత్‌ కిశోర్‌ చుట్టే తిరుగుతున్నాయి. పీకే కాంగ్రెస్‌కు పని చేస్తారా? లేక కాంగ్రెస్‌లో చేరతారా? అది కాకపోతే టీఆర్‌ఎస్‌తో కొనసాగుతారా? అసలు ఏం జరగబోతున్నది? అందరిలోనూ ఇదే చర్చ. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం గందరగోళం. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న ప్రశాంత్‌ కిశోర్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆదివారం ఓ ప్రముఖ హోటల్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని భంగపడిన కాంగ్రెస్‌ ఈసారి అలాంటి పొరపాట్లు చేయకుండా ఒంటరిగా బరిలో దిగాలనుకుంటోంది. అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటోంది. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌తో పీకే సమావేశమవ్వడం వారికి రుచించడం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కోసం పని చేసే పీకే ఇక్కడ టీఆర్‌ఎస్‌ కోసం ఎలా పని చేస్తారన్నది తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సూటి ప్రశ్న. కాంగ్రెస్‌ పార్టీ పీకేను అప్రోచ్‌ కాకముందే టీఆర్‌ఎస్‌ ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే కొంత వర్క్‌ కూడా చేశారు. నివేదికలను రూపొందించారు. ఆ నివేదకలను ఇవ్వడానికే కేసీఆర్‌ను కలిశారన్న మాట కూడా వినిపిస్తోంది. అలాగే దేశ రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్న కేసీఆర్‌ అందుకోసమే పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నారని కొందరు అంటున్నారు. అసలు విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కేసీఆర్‌-ప్రశాంత్‌ కిశోర్‌ సుదీర్ఘ మంతనాల వెనుక మర్మమేమటి? కాంగ్రెస్‌ లేకుండా థర్డ్‌ఫ్రంట్‌ సాధ్యం కాదన్న సత్యాన్ని కేసీఆర్‌ గ్రహించారా? ఇదే పీకే కూడా చెప్పారా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌ సపోర్ట్ ఇస్తారా? అలాగైతే ఇక్కడ మాటేమిటి? వీటికి జవాబులేమో కానీ తెలంగాణ రాజకీయాలలో పీకే ఎంటరయ్యాక కాసింత హడావుడి పెరిగిందన్నది మాత్రం నిజం.