Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్‌డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే చెప్పుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేశారు. గుజరాత్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యే , ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముర్ముకే ఓటేశామని తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటేశారు. తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పార్లమెంట్ భవన్‌లో ఓటేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఓటేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు. వీరితో పాటు తెలంగాణ, ఏపీ ఎంపీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి ములాయంసింగ్ యాదవ్ కూడా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు. అనారోగ్యం కారణంగా వీల్‌ఛైర్‌కే పరిమతమయ్యారు ములాయం. మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు.
తెలుగు రాష్ట్రాల్లో 95 శాతానికిపైగా పోలింగ్..
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. 95 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఏపీలో ఇద్దరు, తెలంగాణ ఇద్దరు ఓటు వేయలేదు. ఏపీలో బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాలకు వెళ్లడంతో ఓటింగ్‌కు రాలేదు. తెలంగాణలో చెన్నమనేని రమేష్ విదేశాలకు వెళ్లడంతో ఓటు వేయలేదు. మంత్రి గంగుల కమకలార్‌కు కరోనా రావడం వల్ల ఆయన రాలేదు. ఇక ఏపీలో 173 మంది, తెలంగాణలో 117 మంది ఓటింగ్ వేశారు. మరోవైపు ఏపీ ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఓటేశారు.
ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు చెల్లుతుందా, లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌పై ఇంకు పడిందని, కాబట్టి మరోటి ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు అధికారులు. దాంతో ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌నే వేశారు సీతక్క.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి