ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. (ఈ కుటుంబ సభ్యులు బీజేపీ మద్దతుదారులని తెలుస్తోంది). ఓ హత్య కేసు విచారణ్మ జరుపుతున్న తన కుమారుడిని రాజకీయ ప్రత్యర్థులు మర్డర్ చేశారని ఉత్తమ్ ఆనంద్ తండ్రి అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. గత బుధవారం ఉదయం జాగింగ్ చేస్తున్న ఉత్తమ్ ఆనంద్ ను టెంపో ఢీ కొనడంతో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. దీన్ని రోడ్డు యాక్సిడెంట్ గా చూపే ప్రయత్నం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ రోడ్డు మధ్యలో వెళ్తున్న ఈ టెంపో సైడ్ కి వెళ్లి ఆయనను వెనుక నుంచి ఢీ కొట్టి వేగంగా వెళ్ళిపోయింది. అంతకు ముందు రోజు రాత్రే ఎవరో ఈ టెంపోను దొంగిలించారని, టెంపో డ్రైవర్ ను, మరో ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
కాగా ఈ కేసు విచారణను తనకు తానుగా చేపట్టిన సుప్రీంకోర్టు.. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి స్టేటస్ రిపోర్టును కోరింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వారం రోజుల్లోగా ఈ రిపోర్టును పంపాలని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్ తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇది రోడ్ యాక్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తోందని ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో జోక్యం చేసుకోవడం తమ అభిమతం కాదని, కానీ ఈ విధమైన అంశాలను విస్తృత రాజ్యాంగ పరిధిలో పరిశీలించవలసిన అవసరం ఉందని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.