PM Modi: శిథిలాల నుంచి శిఖరానికి.. సోమనాథ్ 1000 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ మనోగతం..
వందల ఏళ్ల విధ్వంసంపై గెలిచిన ఆలయం అది.. భారతీయ ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యం ఆ క్షేత్రం. సోమనాథ్ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న శుభవేళ.. ప్రధాని నరేంద్ర మోదీ మే 11న ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన ప్రత్యేక వ్యాసం.. దండయాత్రల చీకటిని చీల్చుకుంటూ సోమనాథ్ ఎలా వెలుగుతుందో అనేది తెలుసుకుందాం..

భారతీయ చైతన్యానికి, అజేయమైన సంకల్పానికి నిదర్శనమైన సోమనాథ క్షేత్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. మే 11న నరేంద్ర మోదీ సోమనాథ్‌ను సందర్శించనున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునరుద్ధరించిన ఆలయం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాసిన ప్రత్యేక సంపాదకీయం భారతీయ నాగరికత గొప్పతనాన్ని, విద్వంసం నుంచి సృజన వైపు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించింది. “తుఫానులు ఎంత భయంకరంగా ఉన్నా, అలలు ఎంత ఉధృతంగా ఉన్నా, గౌరవంతో తిరిగి పుంజుకోవచ్చని సోమనాథ్ తీరంలోని అలలు మనకు చెబుతాయి” అంటూ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు. 2026 ప్రారంభంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని, ఇప్పుడు పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన వేళ అక్కడకు రావడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.
మహనీయులకు నివాళి: శతాబ్దాల పోరాటం
సోమనాథ్‌ను కాపాడేందుకు, పునర్నిర్మించేందుకు శతాబ్దాలుగా కృషి చేసిన మహనీయులను ప్రధాని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహారాజు ధరాసేన, రాజా భోజుడు, సిద్ధరాజ జయసింహ వంటి రాజుల సహకారాన్ని గుర్తు చేశారు. దండయాత్రల నుండి నాగరికతను కాపాడిన భీమదేవ, హమీర్జీ గోహిల్, వేగ్దాజీ భిల్ వంటి వీరుల త్యాగాలను కొనియాడారు. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ ఆలయ వైభవాన్ని నిలబెట్టిన పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సర్దార్ పటేల్ కల – రాజేంద్ర ప్రసాద్ అడుగుజాడలు
1947లో స్వతంత్ర భారతం ఆవిర్భవించిన తరుణంలో సర్దార్ పటేల్ తీసుకున్న సోమనాథ్ పునర్నిర్మాణ నిర్ణయం దేశ చరిత్రలో ఒక మైలురాయి. పటేల్ పిలుపుతో యావత్ భారతం ఒక్కటైందని, ఆయన ఆశయాన్ని కె.ఎం. మున్షీ ముందుకు తీసుకువెళ్లారని ప్రధాని వివరించారు. 1951లో అప్పటి ప్రధాని నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసి భారతీయ సంస్కృతికి పట్టం కట్టారని గుర్తు చేశారు.
వికాస్ భీ.. విరాసత్ భీ
గత దశాబ్ద కాలంగా తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రధాని స్పష్టం చేశారు. సోమనాథ్ నుంచి కాశీ వరకు, అయోధ్య నుంచి కేదార్‌నాథ్ వరకు ఆధ్యాత్మిక కేంద్రాలను ఆధునీకరిస్తూనే, వాటి ప్రాచీనతను కాపాడుతున్నామని తెలిపారు. దీనివల్ల భక్తులకు సౌకర్యాలతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి పెరుగుతుందని అన్నారు. సోమనాథ్ వెయ్యేళ్ల ధైర్యానికి నివాళిగా, రాబోయే వెయ్యి రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ పూజల కోసం దేశవ్యాప్తంగా భక్తులు భారీగా విరాళాలు ఇస్తుండటం విశేషం. “సోమనాథ్ తీరంలో నిలబడితే భారతదేశపు అజేయమైన స్ఫూర్తి మీకు అర్థమవుతుంది” అని పిలుపునిచ్చిన ప్రధాని, ప్రతి భారతీయుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి, కాలాతీతమైన మన నాగరికత వైభవాన్ని అనుభూతి చెందాలని కోరారు.
Wrote an OpEd about my forthcoming visit to Somnath on 11th May and why this day will always be important with respect to Somnath and the greatness of our civilisation. Also paid homage to each and every person who endured all sorts of challenges yet always protected Somnath and…
— Narendra Modi (@narendramodi) May 8, 2026
