
ప్రతీ మనిషికి పట్టెడన్నం పెట్టిననాడే దేశం అభివృద్ధి చెందుతుందని, రైతులు దేశానికి వెన్నుముక లాంటివారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రధానమంత్రి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అయితే తాజాగా రైతులకు విరాళంగా ఆవులు ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్ 19 బుధవారం తన ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి పర్యటన సందర్భంగా గుజరాత్‌కు చెందిన 100 జిఐఆర్ ఆవులను ప్రశాంతి నిలయానికి అందజేయనున్నారు.
ప్రధానమంత్రి సత్య సాయి హిల్ వ్యూ స్టేడియంలో సాయిబాబా మహా సమాధిని దర్శించుకుని, బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీ ఉదయం 9.30 గంటలకు స్టేడియంకు చేరుకుని 11 గంటల వరకు అక్కడే ఉంటారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 100 జీఐఆర్ ఆవులను రైతులకు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకుని, సత్య సాయి విమానాశ్రయంలో ప్రధానిని స్వాగతిస్తారు.
అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న ప్రశాంతి నిలయాన్ని సందర్శించి సత్య సాయిబాబా మహాసమాధిని దర్శనం చేసుకుంటారు. ఉపాధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్ అదే రోజు శ్రీసత్య సాయి ఉన్నత సంస్థల వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవంబర్ 23న జరిగే సత్యసాయి బాబా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి రాత్రికి అక్కడే బస చేస్తారు.
సత్యసాయి బాబా జయంతి వేడుకలకు అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, విదేశాల నుండి ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. శతాబ్ది ఉత్సవాలకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బాబా మెగా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా భక్తులు పుట్టపర్తిని సందర్శిస్తారని అంచనా. బందోబస్తు కోసం దాదాపు 2,500 అదనపు బలగాలను మోహరించనున్నట్లు సత్యసాయి ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
కనీసం 11 లక్షల మందికి వాహనాలు ఉండేలా మూడు ప్రధాన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతి నిలయం, చుట్టుపక్కల అధిక భద్రత కల్పిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని జల్లడ పట్టడానికి 24 గంటలూ హై రిజల్యూషన్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో, ప్రశాంతి నిలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..