PM Narendra Modi to Address Nation Today: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Prime Minister Shri @narendramodi will address the nation at 5 PM today, 7th June.
— PMO India (@PMOIndia) June 7, 2021
అయితే.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రస్తుతం కొంతమేర తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. దీంతోపాటు వ్యాక్సిన్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ విధానాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్, అదేవిధంగా థర్డ్ వేవ్ ముప్పును అధిగమించే ప్రణాళికపై కూడా ప్రధాని మోదీ కీలక సూచనలు చేసే అవకాశముందని పేర్కొంటున్నారు.
ఏప్రిల్ – మే నెలల్లో తీవ్రంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి.. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టింది. అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. తాజాగా రోజువారీ కేసులు లక్షకు దిగొచ్చాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినా.. వ్యాక్సిన్ పంపిణీ మాత్రం ఆశించినంత వేగంగా లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే మూడో దశ మరింత ఉద్దృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ పై దృష్టిసారించింది.
Also Read: