PM Narendra Modi: పెట్రో ధరల పెరుగుదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇంధనం కోసం మన దేశం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఈ అంశంపై శ్రద్ధ తీసుకోని ఉంటే.. ఈ పరిస్థితులు వచ్చేవి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. బుధవారం తమిళనాడులోని రామనాధపురం-తూత్తుకుడి నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ను, గ్యాసోలిన్ డీసల్ఫరైజేషన్ యూనిట్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో మన దేశ అవసరాల్లో 85 శాతం ఆయిల్‌ను, 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇంధనం కోసం దిగుమతులపై ఇంతగా ఆధారపడవచ్చునా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను ఎవరినీ విమర్శించాలని అనుకోవడం లేదని.. అయితే దీనిపై గత ప్రభుత్వాలు ముందుగానే దృష్టి సారించి ఉంటే మధ్య తరగతి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని మోదీ స్పష్టంచేశారు.
జీఎస్టీ పరిధిలోకి సహజ వాయువు: ఇంధన ధరలు దేశవ్యాప్తంగా అందుబాటు ధరల్లో ఒకేలా ఉండేందుకు వీలు కల్పిస్తూ సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. సహజ వాయువును జీఎస్టీలోకి తీసుకువచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. భారత ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రపంచ ఇన్వెస్టర్లను స్వాగతిస్తున్నామని మోదీ తెలిపారు. గత కొంతకాలం నుంచి నిత్యం పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలపై ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: