గుజరాత్ రాజధాని గాంధీనగర్-ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గాంధీనగర్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈసందర్భంగా రైలు ఎక్కి ఇంజిన్ భాగాన్ని పరిశీలించి, పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రైలు బోగి ఎక్కి అందులో ప్రయాణీకులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముచ్చటించారు. గాంధీనగర్ నుంచి కాలుపుర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. రైల్వే సిబ్బంది, మహిళలు, యువకులతో సహా వివిధ రంగాలకు చెందిన ఈ సందర్భంగా ప్రధానమంత్రి ముచ్చటించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పోస్టు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నారు. ఈరైలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మేడిన్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తయారు చేశారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ గురువారం గుజరాత్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 30వ తేదీ అయిన శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సూరత్ లో రూ.3,400 కోట్ల రూపాయల కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల కు గురువారం ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.అలాగే భావ్ నగర్ లో దాదాపు రూ.5,200 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 36వ జాతీయ క్రీడల ను అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇక శుక్రవారం ఉదయం గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను జాతికి అంకితం చేశారు. అదే రైలు లో బయలుదేరి కాలుపుర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయాణించారు.
గుజరాత్ లోని గాంధీనగర్- మహారాష్ట్రలోని ముంబై మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈరెండు నగరాల మధ్య అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది. ఈరైలులో ప్రయాణం రైలు ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. ఇప్పటివరకు ఉన్న అన్ని రైళ్ల కంటే వేగంగా ఈరైలులో ప్రయాణం సాగనుంది. వేగంతో పాటు సౌర్యవంతమైన ప్రయాణం ఈ సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రారంభించిన ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య నూతన అవకాశాలు సృష్టించడంలో కూడా ఆ రైలు ముఖ్య పాత్ర పోషించనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రయాణీకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారంటూ రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలోనూ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..