Union Cabinet Meeting Today: కేంద్ర మంత్రి మండలి ఇవాళ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ వ్యాపిస్తుందన్న హెచ్చరికలతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, కరోనాతో కుదేలైన ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టే పనిలో పడింది కేంద్రం. మరో మూడు, నాలుగేళ్ల వరకు కుదుట పడని పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అవసరమైన ప్రణాళికలు, ఉద్దీపన ప్యాకేజీలతో చర్యలకు ఉపక్రమించాలని కేంద్రం చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడే భేటీ కాబోతుంది.
సెకండ్ వేవ్‌తో విధించిన లాక్‌డౌన్‌తో.. దెబ్బతిన్న వర్గాలను ఆదుకునే దిశగా ఈ కేబినెట్‌లో సమాలోచనలు చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు చాలా దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ మైనస్‌లోకి పడిపోతుందన్న ఆందోళనను ఆర్థిక వేత్తలు వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం సాగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు.
మరోవైపు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు… రాష్ట్రాల డిమాండ్ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. కరోనా టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కేంద్రీకృతంగా సాగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియలో గత నెలలో చేసిన సవరణలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ సమావేశం ఇందుకు సంబంధించి కీలక ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో ఇవాళ కేంద్ర మంత్రిమండలి సమావేశంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also…. NIN Study: దేశంలో మూప్పై శాతం మంది చిన్నారుల్లో ఐరన్ లోపం.. వెలుగులోకి సంచలన విషయాలు…