PM Modi hold high-level meeting : జమ్ము – కాశ్మీర్ ఉగ్రవాదుల డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన హై-లెవెల్ మీటింగ్ కొంచెం సేపటి క్రితమే మొదలైంది. దీనికి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర రక్షణ మంత్రి ఇప్పటికే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జమ్ము-కాశ్మీర్ భద్రత, ఉగ్రవాదుల డ్రోన్ దాడులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రక్షణ, హోంశాఖ మంత్రులు పాల్గొంటున్నారు. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరుగుతోంది.
జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై జరిగిన డ్రోన్ బాంబు దాడుల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది. కాగా, యునైటెడ్ నేషన్స్ సమావేశంలోనూ ఉగ్రవాదుల డ్రోన్ దాడులను భారత్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా, ప్రధాని సమావేశం కంటే ముందు రక్షణ మంత్రికి పరిస్థితిని ప్రెజెంటేషన్ రూపంలో రక్షణశాఖ ఉన్నతాధికారులు వివరించారు.
మరోవైపు, జమ్ము డ్రోన్ దాడిలో ఆర్డీఎక్స్ మిశ్రమాలను ఉపయోగించినట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించిన దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కు కేంద్ర హోంశాఖ అప్పగించింది.