
ఆధ్యాత్మిక నగరమైన కాశీ సరికొత్త పారిశ్రామిక, మహిళా సాధికారత కేంద్రంగా ఎదుగుతోంది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రారంభమైన వస్త్ర పరిశ్రమల యూనిట్ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం (అక్టోబర్ 25) వారణాసిలోని అర్వింద్ మిల్స్ (ఆకృతి ఇనిషియేటివ్) యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించి, అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులతో ప్రత్యేకంగా సంభాషించారు.
గతంలో ఇంటికే పరిమితమైన గ్రామీణ ప్రాంత మహిళలు ఇప్పుడు ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా నెలకు నికర ఆదాయాన్ని పొందుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.శిక్షణ పొందుతూనే జీతం అందుకోవడం తమకు ఎంతో మేలు చేస్తుందని, ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ సంపాదన ఉపకరిస్తుందని కార్మికులు ప్రధానికి తెలిపారు.కొందరు మహిళలు ఇక్కడ అనుభవం గడించి భవిష్యత్తులో సొంతంగా ఎంటర్ప్రైజ్ ప్రారంభించాలని లేదా ఫ్యాషన్ డిజైనర్లుగా, మేనేజర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యాలయంలో భద్రత, సహోద్యోగుల ప్రోత్సాహం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహిళలతో మాట్లాడుతూ.. బనారస్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని గుర్తుచేశారు. బనారస్ చేనేత, వస్త్రాలు ఇప్పుడు భూటాన్, జపాన్ వంటి అనేక దేశాలకు ఎలా ఎగుమతి అవుతున్నాయో వివరిస్తూ, ఇక్కడి నుంచి తయారుయ్యే గార్మెంట్స్ కూడా ప్రపంచ విపణిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. వృత్తిలో సరికొత్త డిజైన్ల సృష్టి, నైపుణ్యం ఎంత ముఖ్యమో ప్రధాని వివరించారు. మహిళల ఎదుగుదల ద్వారా కుటుంబాలు, రాష్ట్రం, తద్వారా దేశం ముందుకు సాగుతుందని ప్రధాని వారిని ప్రోత్సహించారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భారత వైమానిక దళం (IAF) నిర్వహించిన ‘వింగ్స్ ఓవర్ గంగెస్’ ఎయిర్ షో అద్భుతంగా సాగింది. అక్టోబర్ 25 నమో ఘాట్ వద్ద గంగా నది మీదుగా యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై వైమానిక దళ విన్యాసాలను వీక్షించారు. గంటకు పైగా సాగిన ఈ ప్రదర్శనలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తమ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ వారణాసిలోని మిర్జామురాద్ ప్రాంతంలో అరవింద్ లిమిటెడ్‌కు చెందిన వస్త్ర తయారీ యూనిట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు భారత వస్త్ర, దుస్తుల తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని సుమారు 300 మంది మహిళలతో మాట్లాడారు. కొత్త తయారీ కేంద్రం ద్వారా ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని అధికారులు వెల్లడించారు. వారణాసిలో తయారైన దుస్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించేందుకు ఈ యూనిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
వారణాసి పర్యటనలోని విశేషాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఎయిర్ షోను ప్రశంసిస్తూ ‘వారణాసి ఎయిర్ షో.. అద్భుతం!’ అని పేర్కొన్నారు. అరవింద్ లిమిటెడ్ వస్త్ర తయారీ కేంద్రం మహిళా సాధికారతకు ఊతమివ్వడం ఈ యూనిట్‌లోని ముఖ్యమైన అంశాల్లో ఒకటని తెలిపారు. ఒకే పర్యటనలో భారత వైమానిక దళ సత్తా, వారణాసి సాంస్కృతిక వైభవం, పారిశ్రామిక అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి.