PM Modi: ఆ విధానాలు పూర్తిగా మార్చాలి.. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు..

ఆఫ్రికాలో జరిగిన తొలి G20 సదస్సులో ప్రధాని మోదీ ప్రపంచ అభివృద్ధి పద్ధతులను మార్చాలని పిలుపునిచ్చారు. సుస్థిర జీవన విధానాలు, ఆఫ్రికా యువతకు భారీస్థాయిలో నైపుణ్య శిక్షణ, డ్రగ్స్-ఉగ్రవాద సంబంధాన్ని తెంచడం వంటి మూడు కీలక ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు. అందరినీ కలుపుకొనిపోయే అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందించారు.

PM Modi: ఆ విధానాలు పూర్తిగా మార్చాలి.. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు..
Pm Modi G20 Summit

Updated on: Nov 22, 2025 | 5:00 PM

ఆఫ్రికాలో తొలిసారిగా జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ అభివృద్ధి పద్ధతులను లోతుగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న అభివృద్ధి విధానాలు ప్రకృతిని నాశనం చేస్తున్నాయని, ఆఫ్రికాలో సవాళ్లు ఎక్కువగా ఉన్నాయని మోదీ అన్నారు. ఎవరినీ వెనుకబడి ఉంచకుండా, అందరినీ కలుపుకొనిపోయే అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రతిపాదించారు:

సాంప్రదాయ జీవన విధానాలు

పర్యావరణాన్ని కాపాడుతూ, సమాజాన్ని సమతుల్యంగా ఉంచే మన పాత జీవన విధానాలు, సాంప్రదాయ పద్ధతులను గుర్తించాలని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి, అందరికీ అందుబాటులో ఉంచడానికి గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ జ్ఞానం రాబోయే తరాలకు స్థిరమైన జీవన పద్ధతులను నేర్పిస్తుంది. దీనికి భారతదేశంలోని ‘భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్’ ఒక పునాదిగా ఉంటుందని ప్రధాని చెప్పారు.

ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ

ఆఫ్రికా అభివృద్ధి చెందితే అది ప్రపంచం మొత్తానికీ మేలు చేస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ‘‘G20-ఆఫ్రికా మల్టిపుల్ స్కిల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. G20 దేశాలన్నీ దీనికి మద్దతు ఇవ్వాలని మోదీ సూచించారు. పది ఏళ్లలో ఆఫ్రికాలో కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి 10 లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్‌లను తయారు చేయాలి. ఇందుకోసం శిక్షకులకు శిక్షణ పద్ధతిని అమలు చేయాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

డ్రగ్స్-టెర్రర్ సంబంధాన్ని అడ్డుకోవడం

ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని, ఇవి ప్రజారోగ్యానికి, ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పు అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స్ అమ్మకాలు, టెర్రరిజం మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడానికి G20 ప్రత్యేక చొరవ తీసుకోవాలి. డ్రగ్స్ రవాణా నెట్‌వర్క్‌లను నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బు చేతులు మారడాన్ని ఆపడానికి, టెర్రరిజానికి నిధులు అందకుండా చేయడానికి ఆర్థిక, భద్రతా పద్ధతులను అన్ని దేశాలు కలిసి ఉపయోగించాలి’’ అని మోదీ చెప్పారు.

ఈ మూడు ప్రతిపాదనలు ప్రపంచం ఎదుర్కొంటున్న సుస్థిరత, అభివృద్ధి, భద్రతా సమస్యలకు సమిష్టిగా పరిష్కారం చూపడానికి G20 దేశాలను ఏకం చేసే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..