మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?.. కోవిడ్ పరిస్థితులు పాటించాలన్న మోదీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఇదేనా
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మనం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.. అయితే అందుకోసం పెద్దపెద్ద త్యాగాలు చేయాల్సిన పని లేదు.. కానీ మన రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ కోవిడ్ కాలం నాటి పని సంస్కృతిని ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అంటే త్వరలో మళ్లీ లాక్‌డౌన్ పిరిస్థితులు రాబోతున్నాయా? అసలు మోదీ మాటల వెనక ఉన్న అంత్యర్యమేంటో తెలుసుకుందాం పదండి.

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా కరోనా సమయంలో మనం అలవాటు చేసుకున్న పని పద్ధతులను మళ్లీ ఆచరణలోకి తీసుకురావాలని ప్రధాని కోరారు. సాధ్యమైతే చోట ఇంటి నుండే పనిచేసే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించి, ఆన్‌లైన్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారం పడుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని కోరారు. సొంత వాహనాలు వాడాల్సి వస్తే ఒకే వాహనంలో ఎక్కువ మంది వెళ్లాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. శం నుండి విదేశీ కరెన్సీ బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రజలు కొన్ని నియంత్రణలు పాటించాలని ప్రధాని కోరారు.
అనవసరమైన విదేశీ పర్యటనలు, ఓవర్సీస్ వెకేషన్లను పక్కన పెట్టాలని, వాటికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరారు.విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మానుకుని, భారత్‌లోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించడానికి కనీసం ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.అంతర్జాతీయ విభేదాలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల ఏర్పడిన సవాళ్లను భారత్ సమిష్టిగా ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మోదీ మాటల వెనక ఉన్న అంతర్యం ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్ రాబోతుందా?
అయితే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం యావత్త దేశాన్ని మళ్లీ లాక్‌డౌన్ వస్తుందా అనే ఆలోచనలో పడేసింది. అయితే కొందరు నిపుణులు మాత్రం దేశ ఆర్థిక భద్రతను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయని.. తద్వారా భారత్ తన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అందుకే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించమని కోరినట్టు నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, మళ్లీ లాక్‌డౌన్ పరిస్ధితులు రాకుండా ఉండాలన్నా, రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుండి సామాన్యులను, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, ప్రజల్లో క్రమశిక్షణ, పొదుపు అనే ముందస్తు జాగ్రత్తలను అలవాటు చేసేందుకుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
