Gas Shortage: గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. ప్రజలకు కీలక సూచనలు

గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉత్పత్తిని పెంచుతామని, దీని ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. గ్యాస్ సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను మోదీ గట్టిగా తిప్పికొట్టారు.

Gas Shortage: గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. ప్రజలకు కీలక సూచనలు
Gas Shortage

Updated on: Mar 13, 2026 | 9:15 PM

దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ స్పందించారు. గురువారం భారత్ మండపంలో జరిగిన NXT సమావేశంలో పాల్గొన్న ఆయన.. గ్యాస్ సంక్షోభంపై క్లారిటీ ఇచ్చారు. ఇంధన భద్రతకు ద్వంద్వ విధానాన్ని పాటించనున్నట్లు తెలిపారు. దేశీయ మౌలిక సదుపాయాలను పెంచి గ్యాస్ ఉత్పత్తిని పెంచడంతో పాటు విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశంలో ఇంధన లభ్యతను పెంచడానికి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, విదేశీ వనరులపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేకుండా దేశీయంగా స్వయం సమృద్దిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా గ్యాస్ కొరతపై ప్రతిపక్షాల విమర్శలకు కూడా మోదీ కౌంటర్ ఇచ్చారు.

ప్రతిపక్షాలపై విమర్శలు

ఎల్పీజీ కొరత సమస్యను ప్రతిపక్షం తన సొంత ఎజెండా కోసం ఉపయోగించుకుంటుందని, సరఫరాలో నెలకొన్న అడ్డంకులను అధిగమించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుందని మోదీ వివరించారు. ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, దీని ద్వారా దేశానికి హాని కలిగిస్తున్నాయని ఆరోపించారు. గ్యాస్ కొరత సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నిరంతరం పురోగతి సాధిస్తోందన్నారు సంక్షోభాన్ని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదని, వివిధ స్థాయిలలో ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అగ్ర నాయకులతో దీని గురించి తాను ఇటీవల చర్చించానని, రవాణా అడ్డంకులను అధిగమించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.

ఎరువుల ధరలు పెంచకుండా చర్యలు

ఇక పెట్రోలియం నిల్వలపై కూడా మోదీ మాట్లాడారు. 2014కి ముందు దేశంలో కనీస పెట్రోలియం నిల్వలు ఉండగా.. ప్రస్తుత కాలంలో 50 లక్షల టన్నులకుపైగా ఉన్నాయన్నారు. ఇక 2014 నుండి దేశంలో LPG కనెక్షన్లు, LNG టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు అయిందన్నారు. పెట్రోలియం, డీజిల్ రంగంలో సామర్థ్య నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించమన్నారు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో ఎరువుల ధరల పెరుగుతాయనే వార్తలపై కూడా మోదీ స్పందించారు. రైతులపై భారం తగ్గకుండా కట్టడి చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూరియా బ్యాగ్ ధర రూ.300 ఉండగా.. భారత్‌లో కూడా రూ.300 వద్ద ఉంచామన్నారు. సంక్షోభం సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, పుకార్ల వ్యాప్తిని నిరోధించాలని కోరారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow Us