
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దయ్యింది. మే9న ప్రధాని మోదీ రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీని విక్టరీ డేకు ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీ వెళ్లాలని కూడా నిశ్చయించుకున్నారు.. ఈ తరుణంలో పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా రష్యా పర్యటనను ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు. పహల్గామ్ దాడిపై భారత్ చర్యలకు సిద్దమవుతోంది. ఇప్పటికే.. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ పలు మార్లు భేటీ అయ్యారు.. ఈ క్రమంలో రష్యా విక్టరీ డే వేడుకలకు వెళ్లకూడదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు.. దీంతో ప్రధాని మోదీ.. రష్యా పర్యటన రద్దు అయినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మాస్కోకు భారత ప్రతినిధి బృందాన్ని పంపించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు కీలక సమావేశాలు జరిగాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA, ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చ జరిగింది.
పాకిస్తాన్‌పై సైనిక , ఆర్ధిక , రాజకీయ ఒత్తిళ్లను కొనసాగించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. పహాల్గామ్ దాడికి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని తీర్మానించారు. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ఇప్పటికే నానా తంటాలు పడుతోంది. అటారీ సరిహద్దు మూసేయడంతో పాక్‌తో వాణిజ్యం స్తంభించింది.
జమ్ము కశ్మీర్‌లో శాంతి, అభివృద్దిని చూసి పాకిస్తాన్ ఓర్వడం లేదని, అందుకే పహల్గామ్ దాడికి కుట్ర చేసినట్టు కేబినెట్ అంచనాకు వచ్చింది. కశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం పాక్‌కు కంటగింపుగా మారిందని అభిప్రాయపడ్డారు.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రధాని మోదీ 40 నిముషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశ వివరాలు వెల్లడించబోతున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలాఉంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 1, 2 తేదీలలో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మూడు రాష్ట్రాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..