Dalai Lama : లఢాక్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని కనిపించారు. అక్కడి భారతీయ గ్రామాల్లోని ప్రజలు దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ వాళ్లు ఇలా చేశారు. వీళ్లంతా ఐదు వాహనాల్లో వచ్చి గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఇలా నిరసన తెలిపారు. గ్రామస్థులు ఆ ప్రాంతంలో దలైలామా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడమే దీనికి కారణం.
ఈ ఘటనపై భారత ఆర్మీ ఏ కామెంట్ చేయలేదు. సుమారు 10 రోజుల క్రితం కూడా స్థానికులు సోలార్ పంప్ ఏర్పాటు చేస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం ప్రకటించినట్టు సేవాంగ్ చెప్పాడు. ఇలా ఉండగా దలైలామా 86 వ జన్మ దినం సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను గ్రీట్ చేస్తూ ట్వీట్ చేశారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా చైనాతో సంబంధాలను మెరుగు పరచుకునే దిశలో భారతదేశం అన్ని వివాదాస్పద అంశాల్లోనూ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోందని నిపుణుల అభిప్రాయం. అయితే, గత ఏడాది కాలంగా చైనా, భారత సంబంధాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దలైలామాకు మోదీ బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపడం ఆసక్తికరంగా మారింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
స్వయంప్రతిపత్తి గల టిబెట్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా భారతదేశం పరిగణిస్తుంది. చైనా దలైలామాకు వ్యతిరేకి. ఆయనను వేర్పాటువాదిగా చూస్తూ ఆయనతో ఎలాంటి సంబంధాలకైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై కూడా ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. మొదట్లో తమ సైనికుల గురించి చైనా పెదవి విప్పలేదుగానీ, తరువాత నలుగురు మరణించినట్లు వెల్లడించింది. అయితే, అంతకన్నా ఎక్కువ మందే చైనా సైనికులు మరణించినట్లు భారత్ చెబుతోంది.