ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్(Prashant Kishor) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో(Sonia Gandhi) మరోసారి భేటీ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ కోసం రోడ్‌మ్యాప్ తయారు చేసేందుకే ప్రశాంత్‌కిశోర్ సోనియాగాంధీతో భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగురోజుల్లో సోనియాతో మూడోసారి భేటీ అయ్యారు ప్రశాంత్‌కిశోర్. అయితే పీకే కాంగ్రెస్‌లో చేరుతారా..? లేక సలహాదారుగా మాత్రమే ఉంటారన్న విషయం వారం రోజుల్లో తేలిపోతుంది. కాంగ్రెస్‌లో పీకే పాత్రను నిర్ణయించే అధికారాన్ని సోనియాగాంధీకే కట్టబెట్టారు పార్టీ నేతలు. ప్రశాంత్‌కిశోర్‌కు ఏ రోల్ అప్పగించాలన్ని విషయంపై రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకతో ఇప్పటికే చర్చలు జరిపారు సోనియాగాంధీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్ ,దిగ్విజయ్‌సింగ్ , ముకుల్‌వాస్నిక్ , కేకే వేణుగోపాల్, ఏకే ఆంటోని , అంబికాసోని , జైరాంరమేశ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న రోజుల్లో మరోరెండుసార్లు పీకే కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.
ఉత్తరప్రదేశ్ , బీహార్ , ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. మహారాష్ట్ర , తమిళనాడు , బెంగాల్‌లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్ని పీకే సూచనకు రాహుల్‌గాంధీ అంగీకరించినట్టు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 370 స్థానాల్లో గెలుపుపై దృష్టి పెట్టాలని ప్రశాంత్‌కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది.
అయితే ఆ పదవి నుంచి తప్పుకుంటారో లేదో తెలియదు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలను పరిశీలించేందుకు కాంగ్రెస్‌లో ఒక టీమ్ కూడా ఏర్పాటు చేయబడింది. ఈ సూచన కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యమైనదేనా అని ఆ బృందం పరిశీలిస్తుంది. ఈ నివేదికను వారం రోజుల్లోగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించే అవకాశం ఉంది. సోనియాదే తుది నిర్ణయం అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
త్వరలో జరిగే గుజరాత్,హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీకే ఇప్పటికే కీలక సూచనలు చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌కిశోర్ అద్భుతమైన విజయాలు సాధించారు. నరేంద్రమోదీ , బీహార్ సీఎం నితీష్‌కుమార్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , ఏపీ సీఎం జగన్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు పీకే.. వీళ్లందరితో కలిసి పనిచేసిన విషయాలను సోనియా దృష్టికి తీసుకొచ్చారు పీకే.
కాంగ్రెస్ పునర్‌వైభవం రావాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీకి ప్రశాంత్‌కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. బూత్ లెవెల్లో వాట్సప్ గ్రూపుల ఏర్పాటు , ఓటర్ల డేటా సేకరణపై దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌పై గతంలో తీవ్ర విమర్శలు చేసిన పీకే కొద్దిరోజుల నుంచి మనస్సు మార్చుకున్నారు. అదే పార్టీతో కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకంచేయడానికి.. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ని కాదు..
Minister Harish Rao: రోగి సహాయకులకు రూ.5 భోజనం.. కీలక ప్రకటన చేసిన మంత్రి హరీష్ రావు..