Pinarayi Vijayan: కేరళలో మహామహులకే కుదరనిది.. ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు! వరుస ‘విజయ’న్

కేరళ..నూరు శాతం అక్షరాస్యత..సామాజిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రజలు. విచక్షణ కలిగిన ఓటింగ్ ఆ రాష్ట్రంలోనే చూడగలం. ఎందుకంటే, అక్కడ ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా రెండోసారి ప్రజలు ఆవకాశం ఇవ్వలేదు.

Pinarayi Vijayan: కేరళలో మహామహులకే కుదరనిది.. ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు! వరుస విజయన్
Pinarayi Vijayan

Updated on: May 03, 2021 | 11:45 AM

Pinarayi Vijayan: కేరళ..నూరు శాతం అక్షరాస్యత..సామాజిక అంశాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రజలు. విచక్షణ కలిగిన ఓటింగ్ ఆ రాష్ట్రంలోనే చూడగలం. ఎందుకంటే, అక్కడ ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా రెండోసారి ప్రజలు ఆవకాశం ఇవ్వలేదు. ప్రతి ఎన్నికలకూ ఒక కొత్త ప్రభుత్వం మరిపోవాల్సిందే. గత 40 ఏళ్లుగా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఎవ్వరూ అవ్వలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి మహామహులైన నేతలకే అది సాధ్యం కాలేదు. వాళ్ళెంత ప్రజాభిమానాన్ని గెలిచారో అందరికీ తెలుసు. అయినా వాళ్లకు వరుసగా రెండోసారి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ చరిత్ర తిరగరాశారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్‌ పినరయి విజయన్‌. ఇది ఎలా సాధ్యం అయింది. కేరళ ప్రజలు వరుసగా రెండోసారి ఆయనను ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో కూర్చోపెడుతున్నారు?

నాయకత్వ ప్రతిభ..

సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్ నాయకత్వ లక్షణాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కష్టకాలంలో ఏమాత్రం తొణక్కుండా స్పందించడం ఆయన ప్రధాన లక్షణం. గత ఐదేళ్లుగా కేరళకు వచ్చిన ప్రతి కష్టంలోనూ విజయన్ ఎలా ఎదురొడ్డి నిలబడ్డారో అందరికీ తెలుసు. వరుస తుపానులు.. వరదలు.. కరోనా ఒక్కటేమిటి..ప్రతి సంవత్సరం ఎదో ఒక పెను ఉపద్రవమే. ప్రతి ఉపద్రవాన్ని విజయవంతంగా ఎదుర్కున్నారు ఆయన. తుపాన్ల సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు.

ఆయన నాయకత్వ ప్రతిభకు ఉదాహరణ పోయినేడాది దిగబడిన కరోనా మహమ్మారి కల్లోలం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ఆ సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. విజయన్‌ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఈ సమయంలో సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు దన్నుగా నిలిచింది. అడ్వాన్స్‌గా పెన్షన్‌ ఇవ్వడం, ఉచితంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్టకాలంలో ప్రజల బాగోగులు చూసుకున్న విజయన్ కరోనా కష్టకాలం ముగిసిన తరువాత కూడా ఉచిత రేషన్ ఇవ్వడం కొనసాగించింది. అదీ కాకుండా గత ఎన్నికల్లో ఆయన ప్రజలకు 600 హామీలు ఇచ్చారు. వాటిలో 570 హామీలను నెరవేర్చారు. ఈ ఘనత ఆయన ఒక్కరిదే.

విజయన్ చేపట్టిన సంక్షేమ పథకాలలో కొన్ని..

  • ‘లైఫ్‌ మిషన్‌’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు.
  • ‘అర్ధ్రమ్‌ మిషన్‌’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు.
  • ‘ఎడ్యుకేషన్‌ మిషన్‌’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్‌ క్లాస్‌రూమ్స్, హైటెక్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్‌ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు.
  • కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్‌. అ

అంత ఈజీగా ఏమీ కాలేదు..

ఇంత నాయకత్వ ప్రతిభ.. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా విజయన్ అంత తేలికగా ఎన్నికలను ఎదుర్కోలేదు. ఆయనను విలన్ గా చిత్రీకరించడానికి విపక్షాలు పడరాని పాట్లు పడ్డాయి. ఒక దశలో ఆయనపై స్మగ్లింగ్ ఆరోపణలూ వెలుగుచూశాయి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా విజయన్ ఎక్కడా బెదరలేదు. కూటమి బాధ్యతలను భుజాల మీద వేసుకుని ఎల్డీఎఫ్ ను అవలీలగా ఎన్నికల తీరం దాటించారు.

Also Read: కోవిడ్ వేవ్ అదుపునకు దేశంలో లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించండి..కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Social Distance: కరోనా నిబంధనలు.. తప్పని పెళ్లి వేడుకలు.. సామాజిక దూరం పాటిస్తూ ఈ జంట పెళ్లి ఎలా చేసుకుందో చూడండి..