Fact Check: లింక్‌పై క్లిక్ చేస్తే కేంద్రం 46,715 సాయం.. అసలు నిజం ఏంటంటే..?

ఫేక్ లింకులతో కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ప్రకటనలు జనాలు నిజమే అని నమ్మి వాటిపై క్లిక్ చేస్తూ మోసపోతున్నారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అయ్యింది. లింక్‌పై క్లిక్ చేస్తే.. కేంద్రం డబ్బులు ఇస్తుందని ఆ ప్రకటనలో ఉంది. ఇది నిజమా.? కాదా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Fact Check: లింక్‌పై క్లిక్ చేస్తే కేంద్రం 46,715 సాయం.. అసలు నిజం ఏంటంటే..?
Ministry Of Finance

Updated on: Jul 18, 2025 | 6:47 PM

టెక్నాలజీ పెరగడంతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నీ నష్టాలు కూడా ఉన్నాయి. ఓ వైపు డిజిటల్ పేమెంట్లలో ఇండియా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇదే సమయంలో కేటుగాళ్లు అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తూ కొత్త కొత్త సవాళ్లు విసిరుతున్నారు. డిజిటల్ అరెస్టులతో పాటు ఈ లింక్ క్లిక్ చేస్తే కోట్లు వస్తాయంటూ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అలా ఫేక్ లింకులను క్లిక్ చేస్తూ భారీగా డబ్బు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని సార్లు మోసగాళ్లు ప్రభుత్వాలు, ప్రభుత్వ పథకాల పేరుతో డబ్బులను లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లింక్‌పై క్లిక్ చేసి కేంద్రం నుంచి రూ.46,715 ఆర్థిక సాయం పొందండి అంటూ గత కొన్ని రోజులుగా ఓ లింక్ వాట్సాప్ లో తెగ వైరల్ అయ్యింది. కొంతమంది ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు కథ దాగి ఉంది. ఎందుకంటే అవి ఫేక్ లింకులు. వాటిపై క్లిక్ చేస్తే మీ డబ్బు పోవడం ఖాయం.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ప్రతి ఒక్కరికి రూ.46,715 సాయం అందిస్తోంది. దీన్ని కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ కేటుగాళ్లు కొత్త స్కామ్‌కు తెరదీశారు. పలువురు దీనిని నమ్మి లింక్‌పై క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం స్పందించింది. అలాంటి పథకాన్ని ఆర్థిక శాఖ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఇది ఒక స్కామ్ అని.. ప్రజలు ఆ లింక్‌పై క్లిక్ చేయొద్దని సూచించింది. అంతేకాకుండా ఇతర గ్రూపుల్లో షేర్ చేయొద్దని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇటువంటి ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..