Petrol, Diesel Price: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్రం తీసుకున్న నిర్ణయం అనంతరం పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెట్రోపై వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన స్టైల్లో స్పందించారు. సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రజలకు ఇందువల్ల ఎలాంటి ఉపశమనం కలగదని.. రూ.50 వరకు తగ్గిస్తే ప్రజలకు మేలని పేర్కొన్నారు. ఇదంతా డ్రామా అంటూ తెలిపారు. ఇప్పుడు తగ్గించినట్టు చెప్పినా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పెంచుతారంటూ ఆయన కేంద్రంపై ఆరోపించారు. మోదీ ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకం సరిపోదని.. మరింత తగ్గించాలంటూ వ్యాఖ్యానించారు.
ఆరోగ్యం బాగలేకపోవడంతో.. లాలూ పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. లీటర్ ధర రూ.50 తగ్గిస్తే అది ఉపశమన చర్యగా ఉంటుందంటూ సూచించారు. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించగా.. గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో అసోం, త్రిపుర, కర్మాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలు సైతం ఇంధనం ధరలపై వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటన చేశాయి.
Also Read: