
భారత్‌లో మతోన్మాదం, ఉగ్రవాదం ద్వారా విధ్వంసాలు సృష్టించాలన్నది పాక్ పన్నాగమైతే.. భారత సరిహద్దు దేశాల్లో తమ సైనిక స్థావరాలు నిర్మించుకుంటూ.. అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా చైనా దుష్ట పన్నాగాలు బయటపడుతున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత సరిహద్దు దేశాల్లో ఈ మధ్యకాలంలో చెలరేగిన హింసాత్మక ప్రజాందోళనల వెనుక చైనా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడం కోసం చైనా ఈ తరహా కుట్రలకు పాల్పడుతోంది. అనుకూల ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ దేశాలను తమ సైనిక స్థావరాలుగా మార్చుకుంటూ భారత్‌పై నిఘా నేత్రాన్ని విస్తరిస్తోంది. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌లో భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన చైనా.. ఇప్పుడు ఆ దేశంలో వైమానిక స్థావరాలు, ఓడరేవులు నిర్మిస్తూ భారత్‌కు పక్కలో బల్లెంలా తయారవుతోంది. నిన్న పార్లమెంటుకు సమర్పించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక భారత్ ఎదుర్కోబోయే ముప్పులకు సంబంధించి అనేక అంశాలను వెల్లడిస్తోంది.
నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లో చైనా క్రమంగా తన సైనిక, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది. ఇది మన దేశానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ఇప్పటికే పాకిస్తాన్ పట్టు పెరిగి మతోన్మాదం, మత ఛాందసవాదం ఆ దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు చైనా కూడా తోడైతే ఆ దేశం నుంచి ఎలాంటి ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టంగా మారుతుంది. భారత ఉత్తర సరిహద్దు నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరంలో చైనా రన్‌వేను నిర్మిస్తోందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది.
కేవలం వైమానిక స్థావరమే కాదు.. జలాంతర్గాముల కోసం ఒక యార్డ్ కూడా నిర్మిస్తోందని నివేదిక చెబుతోంది. బంగ్లాదేశ్‌లోని పెకువా ప్రాంతంలో ఎనిమిది జలాంతర్గాముల కోసం జలాంతర్గామి యార్డ్‌ను చైనా నిర్మిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నావికాదళం వద్ద కేవలం రెండు జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద సబ్ మెరీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాంతీయ సమతుల్యత, భారత భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
370 మిలియన్ డాలర్లతో బంగ్లాదేశ్ – చైనా మధ్య మార్చి 2025లో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం మోంగ్లా పోర్టును 370 మిలియన్ డాలర్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది బంగాళాఖాతంలో చైనా వ్యూహాత్మక, లాజిస్టికల్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాల్మోనిర్హాట్ ఎయిర్‌బేస్ గురించి బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌ని భారతదేశం అధికారికంగా ప్రశ్నించింది. లాల్మోనిర్హాట్ ఎయిర్‌బేస్‌ను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. అయితే కమిటీ ముందు హాజరైన సెక్యూరిటీ నిపుణులు మాత్రం.. 1971 బంగ్లా విమోచన యుద్ధం తర్వాత ఇది అతిపెద్ద వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాల్మోనిర్హాట్ ఎయిర్‌బేస్ సిలిగురి కారిడార్ (చికెన్ నెక్) నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఇరుకైన కారిడార్ భారతదేశానికి చాలా కీలకం. ఎందుకంటే ఇది ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రాంతం సంక్షోభ సమయంలో అంతరాయం ఏర్పడినా.. లేక శత్రుదేశం చేతిలోకి వెళ్ళినా.. ఈశాన్య రాష్ట్రాలతో భారతదేశానికి అన్ని రకాలుగా సంబంధాలు తెగిపోతాయి.
చైనా రాజకీయ, వాణిజ్య రంగాలలో కూడా చురుకుగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన అతివాద రాజకీయ పార్టీ “జమాత్-ఇ-ఇస్లామీ” ను తమ దేశానికి ఆహ్వానించింది. బంగ్లా రాజకీయ నాయకత్వంతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. అలాగే చైనా తన వస్తువులను బంగ్లాదేశ్ ద్వారా భారత మార్కెట్లో విక్రయిస్తోందని, ఇది భారతదేశ వాణిజ్య ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని కూడా పేర్కొంది. మొత్తంగా సరిహద్దుల్లో భారత మిత్ర దేశాలు క్రమేణా చైనా గుప్పిట్లోకి వెళ్లి శత్రుదేశాలుగా మారుతుండడం.. దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని స్టాండింగ్ కమిటీ నివేదిక పేర్కొంది. అయితే బంగ్లాదేశ్ సహా పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ కమిటీకి హామీ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..