పార్లమెంట్‌కు పెంపుడు కుక్కతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?..

ఆమె రాజ్యసభ సభ్యురాలు. శీతాకాల సమావేశాలు ప్రారంభంకావడంతో పాల్గొనేందుకు పార్లమెంట్‌కు వచ్చారు. అయితే ఆమె ఒంటరిగా రాలేదు. తనతోపాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకొచ్చింది. ఆమె చేసిన పని ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కుక్కను పార్లమెంట్‌కు తీసుకరావడంపై బీజేపీ నేతలు ఫైర్ అవ్వగా.. రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌కు పెంపుడు కుక్కతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?..
Renuka Chowdhury Pet Dog Controversy

Edited By: Ravi Kiran

Updated on: Dec 02, 2025 | 6:38 AM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో పార్లమెంట్‌కు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంగణంలోకి ఒక పెంపుడు జంతువును తీసుకురావడంతో వివాదానికి దారితీసింది. ఈ పెంపుడు కుక్కను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే ఆ దానిని తిరిగి పంపించేశారు. ఈ ఘటనపై మీడియా రేణుకా చౌదరిని ప్రశ్నించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌కు కుక్కను తీసుకురావద్దని ఏదైనా చట్టం ఉందా అని ప్రశ్నించారు. ‘‘ అధికార పార్టీకి జంతువులు అంటే ఇష్టం ఉండదు. ఒక మూగజీవి వాహనంలో ఉంటే.. వారికి ఎందుకు అంత ఇబ్బంది? ఇదొక చిన్న జీవి. ఇది ఎవరినీ కరవదు’’ అని ఆమె అన్నారు.

 బీజేపీ ఎంపీల ఫైర్..

రేణుకా చౌదరి తీరును బీజేపీ నేతలు ఖండించారు. ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. ఈ ప్రత్యేక అధికారాలతో పెంపుడు జంతువులను సభలోకి తీసుకువచ్చేందుకు అనుమతి ఉండదని ఆయన విమర్శించారు. ‘‘పార్లమెంట్‌లో వారు ఎలాంటి చర్చను కోరుకోవడం లేదు. వారికి అంతరాయాలు మాత్రమే కావాలని దీనిని బట్టి తెలుస్తోంది. వారికి డ్రామానే కావాలి, నీతి అవసరం లేదు’’ అని ఆయన ప్రతిపక్షాల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు.

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈ వివాదం వీధి కుక్కలకు సంబంధించిన ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా గుర్తు చేసింది. విద్యాసంస్థలు, బస్, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. అంతేకాకుండా అవి ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా కంచెలు వేయాలని కూడా సూచించింది.

శీతాకాల సమావేశాలు ప్రారంభం

కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈ సమావేశాలలో 13 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. వీటిలో అణుశక్తి బిల్లు, భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, కార్పొరేట్ చట్ట సవరణ బిల్లు, బీమా చట్ట సవరణ బిల్లు వంటివి పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. అటు ప్రతిపక్ష సభ్యులు SIR, ఆర్థిక అసమానత, విదేశాంగ విధానంతో సహా అనేక అంశాలను లేవనెత్తడానికి సన్నద్ధమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.