Special Session in New Parliament Building: ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన భారత పార్లమెంటు భవనం.. ఇప్పుడు ఒక చరిత్ర. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. అమృత కాలంలో దేశ స్థితిగతులను మార్చే కీలక నిర్ణయాలకు ఈ కొత్త భవనం వేదిక కాబోతోంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం సరికొత్త ఘట్టానికి వేదిక కానుంది. చట్టసభలంటే.. ప్రజాస్వామ్య దేశంలో దేవాలయాలతో సమానం. సుదీర్ఘకాలం పాటు ఎన్నో విలువైన సేవలందించిన పార్లమెంట్ భవనం.. భారత్ సువర్ణాధ్యాయానికి సాక్ష్యం. ఎంతో చరిత్ర కలిగిన ఆ భవనం.. పాత్ర ఇక ముగిసింది. ఇవాళ్టి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఉదయం 9.15 గంటలకు ఎంపీలందరి ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల ఎంపీల సమావేశం ఉంటుంది. దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంట్‌కు వెళతారు. ఆ సమయంలో ప్రధాని రాజ్యాంగాన్ని చేతబట్టుకుంటారు. ఆయన వెనుక మిగిలిన ఎంపీలు ప్రధానిని అనుసరిస్తారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. 2.15 నిమిషాలకు రాజ్యసభ ప్రారంభం అవుతుంది.
పాత భవనంతో తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయని భావోద్వేగానికి గురయ్యారు. కొత్త భవనంలోకి వెళ్లినప్పటికీ ఈ భవనం నిరంతర ప్రేరణగా నిలుస్తుందని.. ఈ భవనం భారత్ సువర్ణాధ్యాయానికి సాక్షిభూతమని.. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయని చెప్పారు.
ప్రతిష్టాత్మకంగా కొత్త పార్లమెంట్ నిర్మాణం..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త భవనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని.. ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 384 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్‌లు, పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్ ఇస్తారు. అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు, అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుందీ నవభారత ప్రజాస్వామ్య దేవాలయం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..