President Speech: వికసిత్‌ భారత్‌‌కు ప్రజలు మద్దతు ఇచ్చారు.. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పాలనః రాష్ట్రపతి

|

Jun 27, 2024 | 12:04 PM

లోక్‌సభ సమావేశాల్లో భాగంగా గురువారం సభ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను పార్లమెంటు ముందుంచారు.

President Speech: వికసిత్‌ భారత్‌‌కు ప్రజలు మద్దతు ఇచ్చారు.. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పాలనః రాష్ట్రపతి
President Droupadi Murmu
Follow us on

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (జూన్ 27) పార్లమెంటును ఉద్దేశించిన ప్రసంగించారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయసభలు లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను పార్లమెంటు ముందుంచారు. భారత్‌లో జరిగిన ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత ప్రజలు వరుసగా మూడోసారి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రపంచం చూసింది అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత, రాష్ట్రపతి ముర్ము మొదటిసారి సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. కొత్త లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా దేశ ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రజల ఆశలు, ఆక్షాంక్షలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్రపతి హితవు పలికారు. ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని భావిస్తున్నా అన్న రాష్ట్రపతి, కొత్త స్పీకర్‌ ఓం బిర్లా ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తారని ఆశిస్తున్నానన్నారు.

రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలను కూడా ప్రస్తావించారు . ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద ఎన్నికలని ఆమె అన్నారు. దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారు. అనేక దశాబ్దాలుగా కాశ్మీర్ లోయలో ఓటింగ్ జరగలేదన్న రాష్ట్రపతి, తొలిసారిగా రికార్డులు బద్దలై జమ్మూ కాశ్మీర్ నుండి ఈ ఎన్నికలలో విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారన్నారు. నాలుగు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌ విషయంలో శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌ విషయంలో మార్పు కనిపించింది. ప్రభుత్వం, ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. వారి ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేస్తుందని ప్రజలు నమ్మారన్నారు.

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికలపై నేడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశ ప్రజలు వరుసగా మూడోసారి స్థిరమైన, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రపంచం గమనిస్తోంది. ఇది ఆరు దశాబ్దాల తర్వాత జరిగింది. ప్రజల ఆకాంక్షలు అత్యున్నత స్థాయిలో ఉన్న తరుణంలో అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలు వరుసగా మూడోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. సురక్ష, అభివృద్ధి విషయంలో ప్రజలు విశ్వాసం ఉంచారు. ప్రభుత్వ గ్యారెంటీల విషయంలోనూ ప్రజలు విశ్వసించారు. వికసిత్‌ భారత్‌ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు.

ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని రాష్ట్రతి ముర్ము అభిప్రాయపడ్డారు. ఇది పోటీ సహకార సమాఖ్య, నిజమైన స్ఫూర్తి. రాష్ట్రాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి, ఈ స్ఫూర్తితో ముందుకు సాగుదామన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం చెందాలనే సంకల్పం నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చిందని ఆమె అన్నారు. 10 సంవత్సరాలలో, 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగామన్నారు. 2021-2024 మధ్య భారతదేశం సగటున 8 శాతం వృద్ధిని సాధించిందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

అన్ని సభల్లోకెల్లా ఈసారి సభ ఎంతో విశిష్టమైంది. ప్రజల నమ్మకానికి తగ్గట్టే ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోందన్నారు రాష్ట్రపతి. ఆర్థికంగా పేదలకు మేలుజరిగే ఎన్నో అంశాలు బడ్జెట్‌లో ఉంటాయన్నారు. ప్రపంచంలో 5వ బలమైన ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఎదిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది. కరోనాలాంటి కష్టకాలాన్ని గట్టిగా ఎదుర్కున్నాం. ఇప్పుడు భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగబోతోందన్నారు. అన్ని రంగాల్లోనూ భారత్‌ బలంగా విస్తరిస్తోంది. సర్వీస్‌ సెక్టార్లను కూడా ప్రభుత్వం బలపరుస్తోంది. ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతుల సంక్షేమం కోసం పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ చిన్నచిన్న ఖర్చులను తీర్చుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.3 లక్షల 20 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని చెప్పారు. ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచింది. ఎన్నో మార్పులు తీసుకువచ్చామని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

ప్రజాక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్న రాష్ట్రపతి, గ్లోబల్‌ మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆయూష్మాన్‌ భారత్‌తో దేశప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాం. అడవుల విస్తరణకు కృషిచేస్తున్నాం. గ్రీన్‌ ఎనర్జీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్యను గణనీయంగా పెంచామన్న రాష్ట్రపతి..- పదేళ్లలో 21నగరాల్లో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలబెట్టామన్నారు. పీఎం గ్రామీణ్‌ సడక్‌ యోజనతో 3.80లక్షల కి.మీ రోడ్లు వేశాం. వేగమైన వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాం. తొలిసారి అంతర్జల రైలు మార్గానికి పునాది వేశాం. ఆధునికతను అనుసరించి మా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

ఉభయ సభల సంయుక్త ప్రసంగంలో నీట్ పేపర్ లీక్ గురించి ప్రస్తావించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున దుమ్మెత్తిపోశాయి. దేశంలోని ప్రతి యువకుడికి పెద్ద కలలు కనడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి సరైన వాతావరణాన్ని కల్పించడంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఆమె అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..