Parliament Row: చిన్న పిల్లల్లా ప్రవర్తించకండి.. బీజేపీపై ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో రచ్చ.. సభ్యుల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కడ్ ఆగ్రహం..
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో రచ్చ కొనసాగుతోంది. ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రులు డిమాండ్ చేశారు. బీజేపీపై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రాజ్యసభలో కౌంటర్ ఇచ్చారు ఖర్గే.
స్వాతంత్ర్యపోరాటంలో బీజేపీ నుంచి కనీసం కుక్కకు కూడా ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై చిచ్చు రేగింది. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు బీజేపీ సభ్యులు. ఇప్పుడున్నది గాంధీ కాంగ్రెస్ కాదని , ఇటాలియన్ కాంగ్రెస్ అని నినాదాలు చేశారు. రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావించారు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీజీ సూచించారని , ఖర్గే లాంటి వ్యక్తులు పార్టీకి అధ్యక్షులవుతారని ముందే ఊహించి అలా అన్నారని చెప్పారు పీయూష్ గోయెల్. ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని , లేదంటే సభలో ఆయన్ను అనుమతించరాదన్నారు.
అయితే పీయూష్ గోయెల్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో జవాబిచ్చారు ఖర్గే. సభ బయట రాజస్థాన్ లోని అల్వార్‌లో అన్న మాటలను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. అయినప్పటికి బీజేపీకి స్వాతంత్ర్యపోరాటంతో సంబంధం లేదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.
అధికార విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కడ్. ఇక్కడ జరుగుతున్నది చూసి 130 కోట్ల మంది ఇప్రజలు నవ్వుతున్నారని , మనం పిల్లలం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం