ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం రెట్టింపు వేగంతో ముందుకెళుతోంది. అయినా ఇంకా కొన్ని చోట్ల పురాత కాలం నాటి మూఢనమ్మకాలు, ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, చేతబడులు అంటూ కొందరు ప్రజలపై పైశాచికతత్వాన్ని రుద్దుతున్నారు. జనవిజ్ఞాన వేదికలు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అజ్ఞానుల మెదళ్లు ఏ మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనంగా కర్ణాటకలో ఓ అమానుష సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన తమ కుమారుడు బతికొస్తాడంటూ తల్లిదండ్రులు బాలుడి మృత దేహం చుట్టూ ఉప్పు పాతర వేశారు. ఏకంగా 8 గంటల పాటు అలాగే ఉంచి కన్న కొడుకు కళ్లు తెరచి చూస్తాడని ఎదురుచూశారు. విస్తుగొలిపే ఈ ఘటన బళ్లారి జిల్లా సిరివరలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..సిరివర గ్రామానికి చెందిన సురేశ్ (10) తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లితండ్రులు తమ కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే నీటిలో మునిగిపోయిన వారి చుట్టూ ఉప్పుపాతర వేస్తే బతికొస్తారన్న మూఢనమ్మకంతో అప్పటికప్పుడు వంద కేజీలకు పైగా ఉప్పును తెప్పించాడు. బాలుడి మృతదేహం చుట్టూ ఆ ఉప్పును ధారగా పోశారు. తమ కుమారుడు ఎలాగైనా కళ్లు తెరుస్తాడని సుమారు 7-8 గంటల పాటు డెడ్‌బాడీని అలాగే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. వెంటనే బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..