130 అణ్వాయుధాలు మీ వైపే ఎక్కుపెట్టాం..! ఇండియాపై బెదిరింపులకు దిగిన పాక్‌ మంత్రి

పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి, భారత్‌పై తీవ్రమైన అణ్వాయుధ బెదిరింపులకు దిగారు. ఘోరీ, షాహీన్ వంటి క్షిపణులు, 130 అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచుకున్నట్లు ప్రకటించారు. సింధు జలాల ఒప్పందం రద్దు, నీటి సరఫరా నిలిపివేత వంటి చర్యలకు భారత్ సిద్ధపడాలని హెచ్చరించారు. పహల్గాం దాడి తరువాత భారత్‌ తీసుకుంటున్న చర్యలకు ఇది ప్రతిస్పందనగా ఉంది.

130 అణ్వాయుధాలు మీ వైపే ఎక్కుపెట్టాం..! ఇండియాపై బెదిరింపులకు దిగిన పాక్‌ మంత్రి
Pakistan Minister Hanif Abb

Updated on: Apr 27, 2025 | 4:29 PM

భారత్‌, పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బెదిరింపులకు దిగారు. ఘోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులు, 130 అణ్వాయుధాలను భారత్‌ వైపే ఎక్కుపెట్టి రెడీగా ఉంచామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. పాకిస్తాన్‌కు నీటి సరఫరాను నిలిపివేసే ధైర్యం చేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలి అని అబ్బాసి అన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రదర్శన కోసం కాదని, వాటి స్థావరాలు దేశవ్యాప్తంగా దాగి ఉన్నాయని, రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు.

వారు(ఇండియా) మనకు నీటి సరఫరాను ఆపివేస్తే, వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మన దగ్గర ఉన్న సైనిక పరికరాలు, మన దగ్గర ఉన్న క్షిపణులు షో ఆఫ్‌ కోసం కాదు. దేశవ్యాప్తంగా మన అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. నేను మళ్ళీ చెబుతున్నాను.. ఈ బాలిస్టిక్ క్షిపణులు, అవన్నీ మిమ్మల్ని(ఇండియాపై) టార్గెట్‌ చేసుకొని ఉన్నాయి అని హెచ్చరించారు. 26 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ చర్యలు చేపడుతున్న తరుణంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని, పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేయాలని భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత విమానాలను నిషేధించింది. పాక్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియాలో విమానయాన వ్యవస్థ అతాలాకుతం అయిందని, ఈ నిబంధన ఇంకో 10 రోజులు ఇలాగే కొనసాగితే, భారతదేశంలోని విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని అబ్బాసి అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ తన భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్‌పై నిందలు మోపుతోందని మంత్రి ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..