ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌లోని ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్, ఇరాక్‌లలో చిక్కుకున్న 1778 మంది భారతీయ పౌరులను వెంటనే తిరిగి తీసుకురావాలని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. ఇరాన్‌లో 1595 మంది విద్యార్థులు, ఇరాక్‌లో 183 మంది యాత్రికులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి
Pm Modi And Asaduddin Owais

Updated on: Jun 15, 2025 | 12:05 AM

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లలో చిక్కుకున్న భారతీయ పౌరులను వెంటనే ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని 140 మంది వైద్య విద్యార్థులతో సహా 1,595 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్నారని ఒవైసీ వెల్లడించారు.

ఇరాక్‌లో చిక్కుకున్న 183 మంది భారతీయ యాత్రికుల దుస్థితిని ఆయన వివరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ (పిఎఐ) ఆనంద్ ప్రకాష్‌ను ఇప్పటికే సంప్రదించానని, చిక్కుకుపోయిన వారి సమగ్ర వివరాలను పంచుకున్నానని ఒవైసీ ధృవీకరించారు. ప్రభుత్వ త్వరిత చర్య ఇప్పుడు చాలా కీలకమని ఆయన అన్నారు. దీనిని అత్యవసర పరిస్థితిగా పరిగణించి, అత్యవసర తరలింపు ప్రణాళికను సమన్వయం చేయాలని నేను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను కోరుతున్నాను.

తెలంగాణ నుండి విద్యార్థులు, టూరిస్టులను సురక్షితంగా తిరిగి తీసుకురావాలని నేను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను అని ఒవైసీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చిక్కుకుపోయిన వారి కుటుంబాలలో పెరుగుతున్న ఆందోళన మధ్య ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. మరి ఒవైసీ రిక్వెస్ట్‌పై కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..