
కర్నాటకలోని హసన్ జిల్లాకు గుండెపోటొచ్చిందని, వయసుతో ప్రమేయం లేకుండా డజన్లకొద్దీ జనం హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్ర వంతు. హింగోలీ జిల్లాకు క్యాన్సరొచ్చింది. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోని హింగోలీ జిల్లా. కలెక్టర్ అభినవ్ గోయల్ సంజీవని అభియాన్ పథకం కింద గ్రామాల్లో క్యాంపులు పెడితే.. ఏకంగా 13 వేల 956 మంది మహిళలు క్యాన్సర్ సంబంధిత లక్షణాలున్నట్టు తేల్చారు.
వైద్యారోగ్య వ్యవస్థనే సవాల్ చేసిన ఈ ఉదంతం జరిగి మూడునెలలు దాటింది. అత్యవసర ప్రాతిపదికన వైద్యానికి ఏర్పాట్లు జరిగాయి. కట్‌చేస్తే.. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలోని అదే హింగోలి జిల్లాలో క్యాన్సర్ కేసులు భయపెడుతున్నాయి. సంజీవని పథకంలో భాగంగా అధికారులు జరిపిన స్క్రీనింగ్ పరీక్షల్లో పెద్దఎత్తున మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. మార్చి 8 నుంచి మొత్తం దాదాపు 3 లక్షల మందికి సర్వే చేయగా వీరిలో 14 వేల 542 మంది మహిళల్లో క్యాన్సర్ తరహా లక్షణాలు గుర్తించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబిత్కర్.
ఇంత జరుగుతున్నా మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, స్క్రీనింగ్‌లతోనే సరిపెడతామన్నారు. టాటా మెమోరియల్ ఆస్పత్రి నుంచి శిక్షణ పొందిన క్యాన్సర్ వారియర్స్ ప్రత్యేక శిబిరాలతో క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నారు. హింగోలీ జిల్లాను వెంటాడుతున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.