ORS కనిపెట్టి.. కోట్లాది ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ దిలీప్ మహలనాబిస్‌కు పద్మవిభూషణ్..

|

Jan 26, 2023 | 1:12 PM

ఆ సంక్షోభ సమయంలో పరిస్థితి తీవ్రతను గ్రహించి సూది గుచ్చకుండా సెలైన్‌ను డ్రింక్‌ రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు.. దిలీప్ ఉప్పు-చక్కెర, బేకింగ్ సోడా నీళ్ల మిశ్రమాన్ని తయారు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఓఆర్‌ఎస్‌ తయారీతో డాక్టర్‌ దిలీప్‌కు ప్రపంచ వేదికపై గుర్తింపు వచ్చింది.

ORS కనిపెట్టి.. కోట్లాది ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ దిలీప్ మహలనాబిస్‌కు పద్మవిభూషణ్..
Ors
Follow us on

భారతదేశంలో వివిధ రంగాలలో నిస్వార్థంగా పనిచేసిన, పనిచేస్తున్న వ్యక్తులకు ప్రతీ యేటా పద్మ అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ORS ద్రావణాన్ని కనుగొన్న వైద్యుడు దిలీప్ మహలనాబిస్‌కు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పురస్కారాలలో పద్మ అవార్డులు కూడా ఉన్నాయి. డాక్టర్‌ దిలీప్‌ మహాలనాబిస్‌ డయేరియాకు తక్షణ ఉపశమనాన్ని అందించే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ఆవిష్కర్త. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ ఔషధం డయేరియా, కలరాను 93 శాతం నయం చేస్తుంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో శరణార్థి శిబిరంలో పనిచేశాడు డాక్టర్‌ దిలీప్‌ మహలనాబిస్‌. ఆ శిబిరంలోనే ఓఆర్‌ఎస్ మందు ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. 74వ గణతంత్ర దినోత్సవానికి ముందు 2022 అక్టోబర్ 16న తుది శ్వాస విడిచారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు చెందిన అవిభక్త బెంగాల్‌లోని కిషోర్‌గంజ్ జిల్లాలో 1934 నవంబర్ 12న దిలీప్ జన్మించారు. కలకత్తా మెడికల్ కాలేజీ నుండి పీడియాట్రిక్స్‌లో పట్టభద్రుడయ్యాడు. బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పడినప్పుడు అతను లండన్, ఎడిన్‌బర్గ్‌ల నుండి డిగ్రీలు పొందాడు. అతను బ్రిటన్‌లోని పిల్లల కోసం క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి మొదటి భారతీయ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అరవైలలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (కలకత్తా)లో చేరారు. యుద్ధ సమయంలో, బంగ్లాదేశ్ నుండి వచ్చే శరణార్థులకు వసతి కల్పించడం కష్టంగా ఉన్నప్పుడు, కలరా వ్యాప్తి  విజృంభించింది. ఆకలితో అలమటిస్తున్న, బలహీన శరణార్థులు గుంపులు గుంపులుగా పడిపోయారు. కొద్ది కాలంలోనే మహమ్మారి పరిస్థితి తీవ్రంగా తలెత్తింది. ఆ సమయంలో కలరా మరణాల రేటు 30 శాతంగా ఉండేది.

ఆ సమయంలో, చికిత్స కోసం శరణార్థి శిబిరాలను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించే బాధ్యతను దిలీప్ తీసుకున్నాడు. అతను అప్పటి తూర్పు పాకిస్తాన్ సరిహద్దులో పగలు, రాత్రి తన సహచరులతో కలిసి రోగులకు సేవలందించారు. అయితే, లక్షలాది మందికి రాత్రికి రాత్రే తాత్కాలిక శిబిరాలు నిర్మించడం సాధ్యం కాలేదు. ఇంజక్షన్లు, వైద్య పరికరాలు కూడా సరిపడా సరఫరా కాలేదు. ఆ సంక్షోభ సమయంలో పరిస్థితి తీవ్రతను గ్రహించి సూది గుచ్చకుండా సెలైన్‌ను డ్రింక్‌ రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు.. దిలీప్ ఉప్పు-చక్కెర, బేకింగ్ సోడా నీళ్ల మిశ్రమాన్ని తయారు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఓఆర్‌ఎస్‌ తయారీతో డాక్టర్‌ దిలీప్‌కు ప్రపంచ వేదికపై గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆ తరువాత, దిలీప్ 1975 నుండి 1979 వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కలరా నియంత్రణ విభాగానికి ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, యెమెన్‌లలో కూడా పనిచేశాడు. అతను 1980 లలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా బ్యాక్టీరియా వ్యాధులపై కూడా పనిచేశాడు. కానీ అతను సాధించిన వాటికి తగిన గుర్తింపు లభించలేదని అతని కుటుంబీకులు, బంధువులు భావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..