Operation Kaveri: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ కావేరి చేపట్టింది భారత ప్రభుత్వం. పోర్ట్ సుడాన్ నుంచి INS సుమేధ యుద్ధ నౌక ద్వారా మొదటి బ్యాచ్‌లో 278 మందిని భారత్‌కు తీసుకురానున్నారు. సూడాన్ 3వేల మంది భారతీయులు చిక్కుకోగా.. దశలవారీగా అందర్నీ సేఫ్‌గా దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిటలరీ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఆ దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ‘ఆపరేషన్ కావేరీ’ని ప్రారంభించింది. దానిలో భాగంగా.. పోర్ట్ సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఆపరేషన్ కావేరి పేరుతో సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొస్తున్నారు. భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో INS సుమేధ యుద్ధ నౌక 278 మందితో పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డా వైపుగా ప్రయాణం సాగిస్తోంది. అక్కడి నుంచి భారత్‌కు తీసుకురానున్నారు.
అలాగే.. సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న మిగతా భారతీయులను కూడా తరలించనుంది. సమీప ప్రాంతంలో మరో నౌకను కూడా సిద్ధంగా ఉంచింది భారత ప్రభుత్వం. ఇక.. సూడాన్ అంతర్యుద్ధంలో గురితప్పిన తూటా తగిలి ఇప్పటికే ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం అలెర్ట్ అయింది. సుడాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించేందుకు కేంద్రం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిందన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. సూడాన్‌లోని భారతీయులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుతం సూడాన్‌లో ఉన్న 3వేల మంది భారత పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
First batch of stranded Indians leave Sudan under #OperationKaveri.
INS Sumedha with 278 people onboard departs Port Sudan for Jeddah. pic.twitter.com/4hPrPPsi1I
— Arindam Bagchi (@MEAIndia) April 25, 2023
కాగా, సుడాన్‌లో గత 12 రోజులుగా దేశ సైన్యం.. పారామిలిటరీ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 400 మంది పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలోనే.. సూడాన్‌లోని భారతీయులను సేఫ్‌గా దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఆ దేశ అధికారులతోపాటు, ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ సహా ఇతరులతోనూ తరచూ చర్చలు జరుపుతోంది.