INDIA alliance: ‘ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్’ (ఇండియా) పేరుతో ఏర్పడ్డ విపక్ష కూటమి ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు ఆర్భాటంగా తమ ఐక్యతను చాటే ప్రయత్నం చేసింది. తీరా ఎన్నికల తేదీలు విడుదలయ్యే సరికి తమ ఐక్యత నేతిబీర నెయ్యిలాంటిదే అని చాటుకుంది. ఏ రాష్ట్రం సంగతెలా ఉన్నా తెలంగాణాలోనైనా మిత్ర ధర్మం పాటిస్తూ పొత్తులు పెట్టుకున్నట్టు కనిపించినా.. చివరకు అది కూడా ఆచరణలో అమలయ్యేలా కనిపించడం లేదు. మొత్తమ్మీద ఏ రాష్ట్రంలో చూసినా “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. సొంత బలంతోనే గెలిచేలా ఉన్నప్పుడు పొత్తులు ఎందుకు అన్న భావన కాంగ్రెస్‌లో కలిగిందా? అదే విపక్ష కూటమి ఐక్యతకు గండి కొడుతుందా? అసలేం జరుగుతోంది?
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కొద్ది నెలల ముందు జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నాయి. హిందీ మాతృభాషగా కలిగిన రాష్ట్రాల్లో గట్టి పట్టున్న బీజేపీని ఎదుర్కోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధించిన విజయం ఆత్మవిశ్వాసాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపొందడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవద్దని భావిస్తోంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో పోటీ పడుతుండగా.. మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)యే ఉంది. సాధారణంగా ఎక్కడైనా రాజకీయ పార్టీల మధ్య పొత్తులు పరస్పర ప్రయోజనాలకు కల్గిస్తాయి. కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో పొత్తులు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి.
విపక్ష కూటమి (I.N.D.I.A) ఏర్పడినప్పుడు, విబేధాలు మరచి పరస్పర సహకారంతో బీజేపీని ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని విపక్షాలన్నీ పదే పదే పునరుద్ఘాటించాయి. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ కోశానా ఈ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపించడం లేదు. ఇందుక్కారణం.. పొత్తులతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని కాంగ్రెస్ అంచనా వేయడమే. సమాజ్‌వాదీ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని భావించింది. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయి. ఒక దశలో మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, రాజస్థాన్‌లో 10 సీట్లు ఆ పార్టీకి కేటాయించాలని పట్టుబట్టింది. సాధారణ పరిస్థితుల్లో కొన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వడం వల్ల నష్టం లేకపోగా, ఎంతో కొంత ప్రయోజనమే ఉంటుంది. కానీ కాంగ్రెస్ – బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం కల్పిస్తే మొదటికే మోసం అని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. కేవలం ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రమే పట్టున్న సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు హిందీ మాట్లాడే ఇతర రాష్ట్రాల్లో అడపా దడపా పోటీ చేయడం, స్థానిక నేతల వ్యక్తిగత బలం కారణంగా ఒకట్రెండు స్థానాల్లో గెలుపొందడం జరుగుతోంది. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టి మరిన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని, తద్వారా ఆ రాష్ట్రాల్లోనూ తమ పార్టీని విస్తరించి జాతీయ పార్టీగా అవతరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం తాము బలంగా ఉన్నచోట ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సమాజ్‌వాదీ కోసం కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయించినా.. అక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతతో పాటు కార్యకర్తలు వెంటనే తిరుగుబాటు చేసి బీజేపీలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మళ్లీ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టంగా మారుతుంది. 90వ దశకంలో యూపీలో బీఎస్పీతో పొత్తు తర్వాత కాంగ్రెస్ ఎదుర్కొన్న అనుభవాలు ఇదే పాఠాన్ని బోధించాయి.
సమాజ్‌వాదీతోనే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఐ, సీపీఐ(ఎం)లలో ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండానే కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. ఇదే సమయంలో ఈ పార్టీలు చీల్చే ఓట్ల ద్వారా తమకు ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్న ఆందోళన కూడా కాంగ్రెస్ నేతల్లో అంతర్లీనంగా ఉంది. ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చిన పక్షంలో అది కచ్చితంగా బీజేపీకే లబ్ది చేకూర్చుతుంది. నేతల నుంచి గ్రౌండ్ రిపోర్టులు, సమాచారం అందుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక వ్యూహం రచించింది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర యూనిట్లకు మార్గదర్శనం చేస్తోంది. ఆ ప్రకారం క్రియాశీల పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లతో కూడిన ప్రత్యేక బృందాలు ఇతర ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాలి. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు కాకుండా మరే ఇతర పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రజలకు వివరించి చెప్పాలి. తద్వారా జాతీయస్థాయిలో తమ మిత్ర కూటమిలో ఉన్న పార్టీలపై మాటలదాడి చేయకుండా.. తమ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు I.N.D.I.A పార్టీలను బీజేపీకి కోవర్టులనో.. బీ-టీమ్ అనో నిందించడం కూడా మానుకోవాలి. కాంగ్రెస్ నేతల ప్రసంగాలు, విలేకరుల సమావేశాలలో రాష్ట్రంలో ప్రత్యక్ష పోటీ తమకు బీజేపీకి మధ్యనే ఉందని పదే పదే నొక్కి చెప్పాలి. బీజేపీని ఓడించేందుకు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కే దక్కేలా అన్ని విధాలుగా ప్రయత్నించాలి. ఇదీ క్లుప్తంగా కాంగ్రెస్ వ్యూహం సారాంశం.
ఉత్తరాది రాష్ట్రాల్లో అనుభవాలకు తోడు స్థానిక పరిస్థితుల రీత్యా కమ్యూనిస్టులతో పొత్తుల విషయంలో తెలంగాణలో వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తొలుత సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కేసీ వేణుగోపాల్ స్వయంగా ఆ పార్టీ నేతలకు ఫోన్ చేసి చెప్పారు. కానీ సీపీఐ(ఎం)తో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతో ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి అధికారికంగా ప్రకటించలేదు. తీరా చూస్తే సీపీఐ(ఎం)కు ఇవ్వాలనుకున్న వైరా, మిర్యాలగూడ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఈలోగా సీపీఐకి ఇస్తామన్న చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో బలమైన నేతలు చివరి నిమిషంలో పార్టీకి దొరికారు. కొత్తగూడెం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తమైనట్టు తెలిసింది. ఒకవేళ ఆయన చేరితే ఆ సీటును కాంగ్రెస్ వదులుకనే ప్రసక్తే ఉండదు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లోకి తిరిగిరావడంతో చెన్నూరులో ఆయన లేదంటే ఆయన కుమారుడు వంశీ పోటీ చేయనున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా సరే అక్కడ పార్టీకి బలమైన అభ్యర్థులే అవుతారు. అందుకే ఈ సీటు విషయంలోనూ వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సీపీఐ(ఎం)కు ఇస్తామన్న వైరాలో విజయాబాయిని బరిలోకి దింపి గెలిపించుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. వైరాలో పోటీ చేసేది కాంగ్రెస్ అభ్యర్థే అంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించి సీపీఐ(ఎం)కు ఇచ్చేది లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. మిర్యాలగూడలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇద్దరు ముగ్గురున్నారు. కాంగ్రెస్ గెలవగలిగే అవకాశం ఉన్న సీట్లను కమ్యూనిస్టులకు ఇచ్చి పోగొట్టుకోవద్దని పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకున్నా సరే.. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నప్పుడు పొత్తు లేకపోవడం వల్ల కలిగే నష్టం కూడా ఏమీ ఉండదన్న అంచనాలు వేసుకుంటున్నారు. కమ్యూనిస్టులకు ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత ఓటుబ్యాంకు ఉంటుంది. కానీ ఏ ఒక్క నియోజకవర్గంలో గెలిచేంత సత్తా మాత్రం ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలకు లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు ద్వారా లబ్ది పొంది శాసనసభలో తమ ఉనికి ప్రదర్శించుకోవాలని తాపత్రాయపడింది. కానీ కాంగ్రెస్ వైఖరి చూసి చివరకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఆయన ఈ ఉదయం చేసిన ట్వీట్ ఇదే విషయాన్ని చెబుతోంది.
నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా? అంటూ ప్రశ్నించారు.
నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc
— Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023
ఇదిలాఉంటే.. బీహార్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సైతం ఇండియా కూటమిలో కలకలం రేపాయి. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ (INDIA) కూటమి తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం తప్పుబట్టారు. పాట్నాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా “భాజాపా హటావో – దేశ్ బచావో” ర్యాలీని ఉద్దేశించి జెడియూ చీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను కదిలించడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాయని.. కానీ ముందు వరుసలో ఉండి ప్రధాన పాత్రను పోషించాల్సిన కాంగ్రెస్ వీటన్నింటి గురించి పెద్దగా పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. భారత కూటమి కోసంపెద్దగా పని చేయడం లేదని.. కానీ.. 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోందంటూ నితీష్ కుమార్ అసహనం వ్యక్తంచేశారు. కాగా.. నితీష్ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..