ఎన్నాళ్లో వేచిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. కొత్త పార్లమెంట్ వేదికగా ఈ సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. లోక్‌సభలో ఆమోదం పొందిన నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు.. ఆ తర్వాత రోజే రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా కనీవినీ ఎరుగని మద్ధతుతో బిల్లు పాసైంది. బిల్లుకు ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఓటింగ్ సమయంలో సభలో ఉన్న 214 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. దీంతో సంపూర్ణ మద్ధతుతో పాసైంది మహిళా బిల్లు. ఈ బిల్లుకు రాష్ట్రపతి సమ్మతి ఒక్కటే మిగిలి ఉంది. రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే.. ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందుతుంది.
పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు మాత్రం 2029 నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. జనాభా లెక్కలు, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు అమలైతే చట్టసభల్లో 33శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే.
వచ్చే ఏడాది ఏర్పడే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే జనగణన, నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపడుతుందని బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక చారిత్రక చట్టమని, మహిళా సాధికారతకు ఇది తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.
రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఎక్కువ సమయం మహిళా ఎంపీలే సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. మహిళలకు సంబంధించి ఎంతో కీలకమైన బిల్లుపై చర్చ జరిగే సమయంలో సభాధ్యక్ష స్థానంలో మహిళలు ఉండటం సముచితమని చర్చను ప్రారంభించిన సమయంలోనే సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. “హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఇది యాదృచ్ఛికం మాత్రమే ’’ అని రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అన్నారు. పార్టీలకు అతీతంగా రాజ్యసభలోని మహిళా ఎంపీలదరూ సభాకార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యసభ టీవీలో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా మహిళా ఎంపీలను ప్రత్యేకంగా చూపించారు కూడా.
#WATCH | " It is only a coincidence…as per Hindu calendar, today is Prime Minister Narendra Modi's birthday", says Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar pic.twitter.com/NLjD26kZiS
— ANI (@ANI) September 21, 2023
గతంలో ఎన్నోసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. కాని, రకరకాల కారణాలతో అది చట్టరూపం దాల్చలేకపోయింది. ఒక సభలో ఆమోదం పొంది మరో సభలో ఆమోదం పొందకపోవడం, అన్ని పార్టీలు అనుకూలంగా ఉండకపోవడం జరిగింది. 1996 నుంచి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు రావడం ఇది ఏడో సారి.
ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లుపై లోక్‌సభలో 60 మంది సభ్యులు మాట్లాడారు. వీరిలో 27 మంది మహిళా ఎంపీలే. లోక్‌సభలో 454 మంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. MIMకు చెందిన ఇద్దరు ఎంపీలు వ్యతిరేకించారు. దాదాపుగా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అయితే చాలా పార్టీలు ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..