Omicron: 19 రాష్ట్రాలకు చేరిన ఒమిక్రాన్.. 70 కొత్త కేసులు నమోదు.. 492కు చేరిన సంఖ్య!

|

Dec 27, 2021 | 6:20 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తొలిసారిగా 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, విదేశాల నుంచి ఒడిశాకు తిరిగి వచ్చిన నలుగురికి ఒమిక్రాన్ సోకింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ మొదటి కేసు ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Omicron: 19 రాష్ట్రాలకు చేరిన ఒమిక్రాన్.. 70 కొత్త కేసులు నమోదు.. 492కు చేరిన సంఖ్య!
Omicron
Follow us on

Omicron Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులు ఆదివారం అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 492కి పెరిగింది. ఆదివారం కేరళలో 19 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57కి చేరుకుంది. వీటిలో ఎర్నాకులంలో 11, తిరువనంతపురంలో 6, త్రిసూర్, కన్నూర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఆదివారం 31 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌తో సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో 141 కి పెరిగింది. ముంబైలో 27 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అలాగే ఈ కేసుల సంఖ్య 73కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త కేసులన్నీ ముంబై విమానాశ్రయంలో గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 61 మంది రోగులు ఇన్‌ఫెక్షన్‌ రహితంగా మారడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తొలిసారిగా 9 ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో ఎనిమిది కొత్త కేసులు గుర్తించామని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదివారం తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఒమిక్రాన్ తొలి కేసు..
హిమాచల్ ప్రదేశ్‌లో ‎ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు వెలుగుచూసింది. డిసెంబర్ 12న మండి జిల్లాలో 45 ఏళ్ల మహిళకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించామని, ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించలేదని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్తీ తెలిపారు. ఆ మహిళ డిసెంబర్ 3న కెనడా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిందని, 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. దీని తరువాత, డిసెంబర్ 18 న, ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని NCDCకి పంపారు. ఆ మహిళ ప్రస్తుతం ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుందని తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే రెండు డోసులు తీసుకుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6కి పెరిగింది. వ్యాధి సోకిన వారిద్దరూ ఇతర దేశాల నుంచి వచ్చినవారే. హర్యానాలో ఒమిక్రాన్ మరొక కేసు కూడా వెలుగుచూసింది. దీని కారణంగా కొత్త వేరియంట్‌ సోకిన వారి సంఖ్య 10కి పెరిగింది.

అదే సమయంలో, విదేశాల నుంచి ఒడిశాకు తిరిగి వచ్చిన నలుగురికి ఓమిక్రాన్ సోకింది. ఇద్దరు రోగులు నైజీరియా నుంచి తిరిగి వచ్చారని, మిగిలిన ఇద్దరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చారని రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ (డీహెచ్‌ఎస్) విజయ్ మహపాత్ర తెలిపారు. దీని తర్వాత రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి పెరిగిందని ఆయన చెప్పారు. ఒడిశాలో, డిసెంబర్ 21 న, నైజీరియా, ఖతార్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొత్త వేరియంట్‌ బారిన పడ్డారు.

తెలంగాణలో ఆదివారం మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సోకిన వారి సంఖ్య 44 కి చేరుకుంది. అదే సమయంలో, చండీగఢ్‌లో ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి మరో 2 కేసులు గుర్తించారు. ఇక్కడ మొత్తం 3 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 76,766..
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ల కేసులు తెరపైకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. అదే సమయంలో సోమవారం నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. ఆదివారం, భారతదేశంలో 6,987 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మొత్తం ఇన్ఫెక్షన్ కేసులు 3,47,86,802 కు పెరిగాయి. ఈ సమయంలో, 162 మంది మరణించడంతో ఈ సంఖ్య 4,79,682 కు పెరిగింది. యాక్టిస్ కేసుల సంఖ్య 76,766కి తగ్గిందని, ఇది మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 0.22 శాతం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో చైనా వ్యూహం పని చేయదు.. కీలక ట్విట్‌ చేసిన దక్షిణాఫ్రికా వైరాలజిస్ట్‌

Omicron variant: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య