
భువనేశ్వర్, జులై 14: బాలంగీర్ జిల్లాలోని చిమిని భాటిపాడ గ్రామానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి జూలై 9న తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ప్రఫుల్ల కుమార్ మిశ్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
జూన్ 21న స్వప్నేశ్వర్, అతని భార్య అనామికా సత్పతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనామికా కోపంతో మొబైల్ ఫోన్‌ను భర్తపైకి విసిరింది. అది తలకు తగలడంతో గాయం అయి కుట్లు కూడా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ గాయమే తరువాత స్వప్నేశ్వర్ మరణానికి కారణమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత శనివారం స్వప్నేశ్వర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అతడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే మరణానికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. స్వప్నేశ్వర్ మృతితో ఆయన తండ్రి లక్ష్మీజోర్ పోలీస్ స్టేషన్‌లో అనామికాపై ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరినందున అప్పట్లో కేసు ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. స్వప్నేశ్వర్ మరణం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇక, గొడవ అనంతరం అనామికా కుటుంబ సభ్యులు దంపతుల కుమార్తెను తమ వద్దకు తీసుకెళ్లారని ప్రఫుల్ల ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన కుమారుడు చివరిసారిగా కూతురిని చూడాలని పలుమార్లు కోరినప్పటికీ, ఆమెను తీసుకురాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమా భోయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అదే సమయంలో, స్వప్నేశ్వర్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జూలై 9న ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక,దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.