‘నీట్ పేపర్ లీకవ్వలేదు.. కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకొచ్చాయంతే..’ NTA సుద్దపూస వాక్కులు చూశారా?
‘నీట్’ యూజీ ప్రశ్నప్రత్రం లీకేజీ వ్యవహారం యావత్ భారత్‌ని కుదుపుకు గురి చేసింది. అంచెలంచెల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నీట్ పేపర్ తయారు చేసిన టీచర్లే స్వయంగా పేపర్ లీక్ చేయడంతో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఏ (NTA) అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందకు విఫల యత్నం చేస్తున్నారు..

న్యూఢిల్లీ, మే 22: నీట్ పేపర్ లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని చెబుతూ.. NTA కొత్త రాగం అందుకుంది. మే 3, 2026వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దాదాపు 23 లక్షల మంది వైద్య విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. నీట్ పరీక్షకు ముందు బయటకు వచ్చిన ప్రశ్నలతో అసలు నీట్ పేపర్‌లోని ప్రశ్నలు అచ్చుగుద్దినట్లు సరిపోవడం నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్టీయేను పిలిపించింది. అయితే నీట్ యూజీ పరీక్ష పేపర్ పూర్తిగా లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ పార్టీమెంటరీ కమిటీకి తెలపడం విడ్డూరంగా ఉంది.
నీట్ పరీక్షలో కొన్ని అవకతవకలు, అక్రమాలు జరిగాయి. అంతేతప్ప పూర్తిగా పేపర్ లీకవ్వలేదని ఎన్టీయే ప్యానెల్‌కు తెలిపింది. జూన్ 21న ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్నామని, లీకేజీకి ఆస్కారమివ్వకుండా ఈ పరీక్ష నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎన్టీఏ అధ్యక్షుడు అభిషేక్ సింగ్, ఉన్నత విద్యా శాఖ సెక్రటరీ వినీత్ జోషి పార్లమెంటరీ కమిటీకి వెల్లడించారు. అవకతవకలను తమ సంస్థ ఏమాత్రం సహించదని, అందుకే రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరోవైపు నీట్ లీకేజీ వివాదంపై సీబీఐ విచారణలో ఎన్టీయేలో కీలక సూత్రధారులు సహా అనేక రాష్ట్రాల్లో పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుతో నీట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన టీచర్లు, మధ్యవర్తులు, పరీక్షా కేంద్రాల సిబ్బంది, నీట్ అభ్యర్ధులు ఉన్నారు. లీకేజీతో నేరుగా సంబంధమున్న ఫిజిక్స్ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధరే, శివరాజ్ మొటెగావ్‌క్కర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణి, పిడియాట్రిషియన్ మనోజ్ శిరురే, మనీషా వాగ్‌మరేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వీరితోపాటు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాశిక్‌లోనూ పలు అరెస్ట్‌లు జరిగాయి.
జూన్ 21న మళ్లీ పరీక్ష
మే 3న నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేసిన తర్వాత నీట్-యూజీ 2026 మళ్లీ జూన్ 21, 2026న నిర్వహిస్తామని జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షకు అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదనంగా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్‌లు చెల్లుబాటులో ఉంటాయని ఎన్టీయే స్పష్టం చేసింది. పరీక్ష 10 రోజుల ముందు కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. అలాగే విద్యార్థులు ఎగ్జాం సెంటర్లను ఎంచుకునేందుకు కూడా అవకాశం ఇస్తారు. ఇక జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పెన్ను, పేపర్ పద్ధతిలో నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నారు. లీకేజీల నేపథ్యంలో నీట్ పరీక్షకు అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఇప్పటికే పలు మార్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
