International Airport: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా విమానాశ్రయాలు నిర్మాణం అవుతున్నాయి. తాజాగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి మరో అడుగు పడింది. జెవార్‌లోని 1334 హెక్టార్ల భూమిని అప్పగించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సంయుక్త సంస్థకు, స్విస్ డెవలపర్ అయిన జూరిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏజీకి చెందిన ప్రత్యేక కంపెనీకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఎన్‌ఐఏఎల్), యమున ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య ఈ లైసెన్స్ మెమొరాండం కుదిరిందని ఒక అధికార ప్రకటన వెల్లడించింది.
మొదటి దశలో 1,334 హెక్టార్లలో అభివృద్ధి చేపట్టనున్నారు. అయితే ఈ విమానాశ్రయానికి రెండు రన్‌వేలు ఉంటాయి. ప్రాథమికంగా 1.2 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నిర్మాణం అవుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విమానాశ్రయాన్ని 2024 చివరి నాటికి రూ.5,700 కోట్ల పెట్టుబడితో మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.