రాజద్రోహం చట్టం(sedition law) 124A అమలుపై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాన్నిప్రభుత్వం పునః సమీక్షించే వరకు కొత్త కేసులు రిజిస్టర్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ఈ చట్టం వలస పాలకుల నాటిది. ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ NV రమణ(NV Ramana) నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ కొన్ని రోజులుగా వాదనలు వింటోంది.152 ఏళ్ల నాటి ఈ చట్టాన్ని పునః సమీక్షించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. పునఃసమీక్ష పూర్తయ్యే వరకు ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కేసులు నమోదు చేయకుండా ఉంటాయని ఆశిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. రాజద్రోహం చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
IPC సెక్షన్ 124A రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనరల్ SG వొంబట్‌కెరే, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై నుంచి ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా వలసవాద రాజద్రోహ చట్టం మనకు అవసరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేస్తే బెయిల్ పొందేందుకు వీలు ఉండదు. యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రాజద్రోహ నిబంధనలను 1837లో బ్రిటన్‌కు చెందిన చరిత్రకారుడు థామస్ మెకాలే రూపొందించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ద్వేషాన్ని, ధిక్కారాన్ని ప్రోత్సహించడం రాజద్రోహమవుతుందని ఈ చట్టం చెబుతుంది. 2010 నుంచి 2021 వరకు దేశంలో రాజద్రోహం నేరం కింద 13306 కేసులు నమోదయ్యాయి.
“రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, ఏదైనా దర్యాప్తు కొనసాగించకుండా లేదా బలవంతపు చర్యలు తీసుకోకుండా నిరోధించగలం. IPC సెక్షన్ 124A పైన పేర్కొన్న చట్టం నిబంధన పరిశీలనలో ఉంది.” News9తో మాట్లాడిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, “దేశద్రోహ చట్టంపై ఎలాంటి స్టే లేదు. ప్రభుత్వం పునఃపరిశీలన ప్రక్రియ కొనసాగేంత వరకు కొత్త దేశద్రోహ కేసులు నమోదు కాకూడదని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసిందని అన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడానికి కేంద్రాన్ని కోర్టు అనుమతించిందన్నారు.
Read Also.. Wife and Husband: ప్రేమించి పెళ్లాడింది.. చివరకు భర్త ఇంట్లో అది లేదని ఆత్మహత్య చేసుకుంది..!