Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా పట్టుకొని అంతం చేస్తామన్నారు అమిత్‌షా. పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన చర్యలకు కేంద్రం సిద్దమయ్యింది. పాక్‌ నౌకలకు భారత రేవుల్లో బ్యాన్‌ విధించబోతున్నారు. పాక్‌కు పోస్టల్‌ సేవలను కూడా నిలిపివేయబోతున్నారు. ఆ వివరాలు ఇలా..

Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
Amit Shah

Updated on: May 01, 2025 | 10:00 PM

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు అమిత్‌షా . 27 మంది అమాయకులను హత్య చేసిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు ఉందన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదన్నారు అమిత్‌షా. భారత్‌ గడ్డ మీద ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. ‘మా 27 మంది పౌరుల ప్రాణాలు తీసి యుద్దం గెలిచామని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నా.. దాడికి ప్రతీకారం తప్పదు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఈశాన్యంలో ఉగ్రవాదులను, మావోయిస్టులను, కశ్మీర్‌ ఉగ్రవాదులను ఏరివేస్తున్నాం’ అని అమిత్ షా అన్నారు.

పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. అరేబియా సముద్రంలో INS సూరత్‌ ప్రవేశంలో శత్రుదేశాల దడ పుడుతోంది. గుజరాత్‌ లోని హజీరా పోర్ట్‌కు INS సూరత్‌ చేరుకుంది. రెండు రోజుల పాటు ఈ యుద్ద నౌక ఇక్కడే ఉంటుంది. గుజరాత్‌ లోని ఓ నగరం పేరు మీద యుద్ద నౌకను నిర్మించడం ఇదే తొలిసారి. INS సూరత్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చేతక్‌ , ధ్రువ్‌ హెలికాప్టర్లను తీసుకెళ్లే సామర్ధ్యం ఈ యుద్ద నౌకకు ఉంది. అంతేకాకుండా రాత్రి సమయంలో కూడా ఈ యుద్ద నౌక నుంచి ఆర్మీ హెలికాప్టర్లు ఎగిరే విధంగా రూపొందించారు.

సింధు జలాలపై వారం రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌ను సిద్దం చేస్తోంది కేంద్రం. అమిత్‌షా వివిధ కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. సింధు జలాలపై కొత్త డ్యాంల నిర్మాణం, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెడుతోంది కేంద్రం. సింధు జలాల్లో తొలుత బురదను తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తారు. పాకిస్తాన్‌పై మరో కీలక నిర్ణయానికి భారత్‌ రెడీ అయ్యింది. పాక్‌ నౌకలకు భారత నౌకాశ్రయాల్లో నో ఎంట్రీ అని చెప్పబోతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు పోస్టల్‌ సేవలను కూడా నిలిపివేసే ఆలోచనలో ఉంది కేంద్రం. పహల్గామ్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. బారాముల్లాలో ఉగ్రవాదులు ఎంట్రీ ఇచ్చారన్న సమాచారంతో కూంబింగ్‌ చేపట్టారు. హైవేపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.