No insurance: అతిగా మద్యం తాగి మరణించిన వారికి ఇన్సూరెన్స్ రాదు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
No insurance For Alcohol Consumption Deaths: బీమా పరిహారం చెల్లింపు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని..
No insurance For Alcohol Consumption Deaths: కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి అకాల మరణం పొందింతే ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీమా పాలసీలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఇందుకోసం రకరకాల సంస్థలు పాలసీలు అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే బీమా సంస్థలు పలు రకాల షరతులు విధిస్తుంటాయి. పలానా కారణంతో మరణిస్తే బీమా పరిహారం చెల్లిస్తామంటూ కొన్ని కండిషన్స్ పెడుతుంటారు. బీమా పరిహారం చెల్లింపు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పును ప్రకటించింది. ఈ విషయమై ఎం.ఎం. శాంతన్ గౌండర్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసం… ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర సందర్భాల్లో బీమా మొత్తాన్ని అందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే 1997లో జరిగిన ఓ వ్యక్తి మరణానికి సంబంధించి ఫైల్ అయిన ఓ కేసు విషయమై సుప్రీం ఈ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 1997లో సిమ్లా జిల్లాలోని చోటాప్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో పనిచేస్తోన్న ఓ వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో భారీగా వర్షాలు కురవడం, చలి కారణంగానే సదరు వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.. ఆ వ్యక్తి గాయాల కారణంగా మరణించలేదని, అధికంగా మద్యం సేవించడం వల్లే మరణించాడని నివేదిక ఇచ్చారు. ఈ కారణంతో పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సదరు బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, మరణించిన వ్యక్తి పనిచేసిన అటవీ సంస్థ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయగా కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లించాల్సిన అవసరం రెండు సంస్థలకూ లేదంటూ తేల్చి చెప్పింది.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత సన్నివేశం.. తవ్వకాల్లో బయటపడ్డ ప్రాచీన అవశేషాలు..