టెస్లా భారత్‌కు రావొచ్చు. వాహనాలు అమ్ముకోవచ్చు. కానీ కండీషన్స్ అప్లై అంటోంది ఇండియన్ గవర్నమెంట్. భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా అన్నిరకాల ప్రయత్నాలు చేసింది. కాని ప్రభుత్వ నిబంధనలు, షరతులతో వెనక్కి తగ్గింది. దీనిపై ఇప్పుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కామెంట్ చేశారు. ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభిస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు.
కానీ, అన్ని భాగాలనూ భారత్‌లోనే తయారు చేయాలని షరతుపెట్టారు. చైనాలోనో లేదంటే వేరే దేశంలోనో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే కుదరదన్నారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మస్క్ భారత్‌లోని ఏ రాష్ట్రంలో తయారీ యూనిట్లను నెలకొల్పినా కేంద్రం సహకరిస్తుందని అన్నారు. అన్ని రాయితీలను కల్పిస్తుందని స్పష్టం చేశారు. భారత్‌లో ఆటోమొబైల్ రంగంలో ఏటా 7.5 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్‌గా భారత్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం చేకూరుస్తున్న రంగం ఇదేనన్నారు. అంతేకాకుండా దాదాపు 4 కోట్ల మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లను టెస్లా సంస్థ అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో దిగుమతి చేసి విక్రయించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని ఎలాన్ మస్క్ గతంలో చెప్పారు. అయితే, మేక్-ఇన్-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం ఎలాన్ మస్క్ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. దీంతో టెస్లా తన ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..