
ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ హైవేలపై వాహనదారులకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. నేషనల్ హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ఫీజు చెల్లించనివారు, ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. అదేంటంటే.. టోల్ ఫీజు లేదా ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే అలాంటి వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించడానికి వీల్లేకుండా అనుమతి నిరాకరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అలాంటి వారికి నేషనల్ హైవేస్‌పై ప్రయాణించకుండా నిషేధం విధించనున్నారని ప్రచారం సాగుతోంది.
ట్రాఫిక్ ఉల్లంఘించేవారు, టోల్ ఫీజు చెల్లించకుండా దాటి వేళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టం, 1988కి కీలకమైన సవరణలు చేయాలని చూస్తోంది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించకపోయినా లేదా ట్రాఫిక్ చలాన్లు ఉన్నా టోల్ ప్లాజాల వద్ద నిలిపివేసేలా నిబంధనలు తీసుకురానున్నారు. దీంతో వాళ్లు చలాన్లు తిరిగి చెల్లించేంత వరకు జాతీయ రహదారులపై ప్రయాణించడానికి వీలుపడదు. ఇలాంటి ఆంక్షలు విధిస్తే డ్రైవర్లు నిబంధనలు పాటిస్తారని కేంద్రం ఆశిస్తోంది.
ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నా చాలామంది కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 మధ్య కాలంలో సుమారు 400 మిలియన్ల ఈ ఛలాన్లు జారీ అయ్యాయి. వీటి విలువ రూ.61 వేల కోట్లుగా ఉంది. కానీ ఇందులో మూడింటి ఒక వంతు కంటే కొంచెం ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి తిరిగి వచ్చింది. అందుకే ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే.. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు జరుగుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. దీంతో దేశంలో రోడ్డు భద్రతను పటిష్ట చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రోడ్డు భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసేందుకు వాహనదారులు డ్రైవింగ్ ప్రవర్తనను మార్చడం, చట్టం పట్ల ఎక్కువ గౌరవాన్ని పెంపోందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటార్ వెహికల్ సవరణ చట్టంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అటు 2030 నాటికి ప్రమాద మరణాలు, గాయల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం వెళ్తోంది.