
న్యూఢిల్లీ, మే 16: నీట్ పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం బట్టబయలైంది. బయాలజీ పేపర్ లీక్ చేసిన మాస్టర్‌మైండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన సీనియర్ బయాలజీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్టీఏ (NTA) నిపుణురాలిగా ఉంటూనే ప్రశ్నపత్రాలను కొల్లగొట్టిన మనీష. తన ఇంట్లోనే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు పెట్టి బయాలజీ ప్రశ్నలు లీక్ చేసింది. మనీషా నోట్ చేయించిన ప్రశ్నలే నీట్ అసలు పేపర్‌లో రావడంతో నివ్వెరపోయిన అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా 9 మందికి అరెస్టుల సంఖ్య చేరింది. నిందితులు విద్యార్ధుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. 6 ప్రాంతాల్లో సీబీఐ మెరుపు దాడులు చేసి కీలక ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను స్వాధీనం చేసుకుంది.
NEET-UG పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను రౌజ్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు హాజరుపరిచారు. నిన్న అరెస్టయిన మాస్టర్‌మైండ్ పీవీ కులకర్ణి, అతని సహాయకురాలు మనీషా వాఘ్మారేను హాజరుపరిచి CBI కస్టడీ కోరింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్ట్ అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి, ఈ రోజు అరెస్ట్ అయిన బయాలజీ టీచర్ మనీషా ఇద్దరు మాస్టర్‌మైండ్ల వెనుక ఒకే మహిళ ఉండటం గమనార్హం. కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి, బయాలజీ టీచర్ మనీషా గురునాథ్‌తో కలిసి మనీషా వాఘ్మరే సిండికేట్‌గా వ్యవహరించింది.
ఎన్టీఏ (NTA) నిపుణులుగా ఉంటూనే పేపర్ లీక్ చేసిన కులకర్ణి, మనీషా గురునాథ్.. డబ్బున్న విద్యార్థులను వేటాడి స్పెషల్ క్లాసులకు రప్పించారు. ఇందుకు మధ్యవర్తిగా వ్వహరించింది మనీషా వాఘ్మరే. పేపర్ లీక్ కేసులో కీలకమైన మనీషా వాఘ్మరే బ్యాంక్ ఖాతాలు సీబీఐ సీజ్ చేసింది. సిండికేట్ గుట్టు విప్పే పనిలో ఉన్న అధికారులు.. త్వరలోనే మరిన్ని అరెస్టులకు తెర దించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.