Naxal Attack in Chhattisgarh kills twenty two: అడవిలో మళ్ళీ అలజడి. చాలా కాలంగా నెత్తురోడని చత్తీస్ గఢ్ అడవుల్లో రక్తం చిందేలా హింసోన్మాదం ప్రదర్శించారు మావోయిస్టు నక్సల్స్. ఈసారి జరిపిన మెరుపు దాడిలో ఏకంగా 22 మంది భద్రతా బలగాల సిబ్బందిని అత్యంత పాశవికంగా, దారుణంగా హతమార్చారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్న వివిధ భద్రతా బలగాల బృందాలపై మావోయిస్టులు దారుణంగా దాడులకు దిగారు. మందుపాతర పేల్చారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఈ దారుణ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక రోజు తర్వాత అంటే ఏప్రిల్ నాలుగో తేదీనగానీ వెలువడలేదు. తొలుత ఎనిమిది మంది భద్రతా దళాల సిబ్బంది మరణించారని భావించినా.. మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఇందరిని హతమార్చిన మావోయిస్టులు.. వారి నుంచి ఏకంగా రెండు డజన్ల ఆయుధాలను తస్కరించారు.
మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. చత్తీస్ గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది. మరోవైపు వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఎన్ కౌంటర్లు అనివార్యమవుతున్నాయి. ఇరువైపులా నష్టం జరుగుతోంది. తాజాగా తర్రెమ్ ఎన్ కౌంటర్‌లో ఇదే జరిగింది. కానీ ప్రాణనష్టం భద్రతా దళాల వైపే ఎక్కువ జరిగింది. ఏప్రిల్ 3వ తేదీన బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. దీనిని ఎన్‌కౌంటర్ అనే కంటే మావోయిస్టుల దాడిగా అభివర్ణించవచ్చు. మావోయిస్టులు మందుపాతర పేల్చే సమయంలో ఆ ప్రాంతంలో ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలకు చెందిన సుమారు 400 మంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయినా గానీ సెక్యురిటీ ఫోర్సెస్ వైపే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది.
మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిద్మా నాయకత్వంలో ముందుగా మందుపాతర పేల్చి.. ఆ తర్వాత పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ముందుగా ఈ దాడిలో ఎనిమిది మంది మరణించినట్లుగా గుర్తించారు. ఆదివారానికి మృతుల సంఖ్య 22గా తేలింది. ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందారు. తర్రెమ్ అటవీ ప్రాంతానికి 9 అంబులెన్సులను పంపారు. గాయపడిన వారికి చికిత్స అందించారు. వీరిలో సీరియస్‌గా వున్న వారిని రెండు హెలికాప్టర్లలో తరలించారు. ఈ నక్సల్ దాడిలో మొత్తం 22 మంది సెక్యురిటీ సిబ్బంది మరణించారని బీజాపూర్ ఎస్పీ కామలోచన్ కశ్యప్ వెల్లడించారు.
మరికొన్ని భారీ ఎన్ కౌంటర్లివే..
2021 మార్చి 29 మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో అయిదుగురు మావోయిస్టు నక్సల్స్ మరణించారు. గడ్చిరోలి జిల్లా కోబ్రామెడ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ నిర్వమిస్తుండగా.. మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు మొదలయ్యాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సుదీర్ఘంగా కాల్పులు కొనసాగాయి. 2016 అక్టోబర్ 24న ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎన్‌కౌంటర్ జరగ్గా.. అందులో ఏకంగా 23 మంది మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. 2018 మార్చి 2 తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2018 జులై 20 ఛత్తీస్ గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్‌కౌంటర్ జరగ్గా.. అందులో ఏడుగురు మావో యిస్టులు మరణించారు. 2019 ఆగస్టు 4 ఛత్తీస్ గఢ్‌లోని రాజ్ నందగావ్ జిల్లా సీతగోట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగి.. ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. 2019 సెప్టెంబర్ 22 విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు.
2020 ఫిబ్రవరి 22 ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదే సంవత్సరం మే 9వ తేదీన ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ రాజనందగావ్ జిల్లా మన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పర్దోనిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఓ పోలీసు ఎస్‌ఐ సహా నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అదే ఏడు.. జులై 6వ తేదీన ఒడిశాలోని కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 2020 అక్టోబర్ 18 మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా .గైరపట్టిలో కొసమి-కిసనెల్లి సమీపంలోని అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్‌కు మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇందులో ముగ్గురు మహిళలున్నారు.
సరిగ్గా పది రోజుల క్రితం అంటే మార్చి 23వ తేదీన ఛత్తీస్‌ఘడ్ జిల్లా నారాయణ్‌పుర్ జిల్లా కన్హర్గావ్లో నక్సల్స్ విరుచుకుపడ్డారు. రిజర్వు గార్డు (డీఆర్జీ) జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చి వేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. అటు అయిదుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ పేల్చివేత వివరాలను వెల్లడించిన ఛత్తీసగఢ్ డీజీపీ అవస్థి.. ఆ తర్వాత అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దాంతో పేలుడు జరిగిన ఏరియాకు భద్రతా బలగాలు పెద్దఎత్తున చేరుకున్నాయి. తనిఖీలను, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అంతకు ఒక రోజు ముందు అంటే మార్చి 22న బస్తర్ జిల్లాలో నక్సల్స్ దాడికి తెగబడ్డారు. అందులో 17 మంది జవాన్లు దుర్మరణం చెందారు. ఇందులో ఐదుగురు ఎస్టీఎఫ్, 12 మంది డిఆర్‌జి సిబ్బంది వున్నారు.
తెలంగాణ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో ఇటీవల మందుపాతర పేల్చిన మావోయిస్టులు.. ఒక కమాండోని బలిగొన్నారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట మావోయిస్టుల హింసాత్మక చర్యలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్, బీహార్‌లో పెద్దఎత్తున హింసకు పాల్పడుతున్నారు మావోయిస్టులు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో మొత్తం 2056 మంది మరణించారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేసమయంలో దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల వివరాలను కూడా వెల్లడించింది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలుగా కేంద్ర హోం శాఖ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సంఖ్య 2018లో 13గా వుండగా.. ప్రస్తుతం ఈ రాష్ట్రాల సంఖ్య పది. 2009-13 మధ్య 8,782 మావోయిస్టుల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో సుమారు మూడు వేల మంది భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. 2014-2018 మధ్య కాలంలో 6,969 ఘటనలు జరిగాయి. సుమారు 1200 మంది మరణించారు. ఇక 2009 నుంచి 2018 మధ్య కాలంలో 1400 మంది మావోయిస్టు నక్సల్స్ మరణించినట్లు హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ లో గతంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌లో పెద్ద ఎత్తున జవాన్లు మరణించిన ఉదంతాలన చూస్తే.. 2008లో రాణిబోదిలి సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడి అందరికి గుర్తుండిపోతుందని చెప్పుకోవాలి. ఈ దారుణ ఘటనలో 55 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. 2010లో దంతేవాడ జిల్లా తాటిమెట్ల, చింతల్ నార్ వద్ద జరిగిన భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడి.. ఏకంగా 76 మందిని బలిగొన్నారు. 2013 సంవత్సరం చత్తీస్ గఢ్ ఎన్నికల సమయంలో సల్వాజుడుం రూపకర్త మహేంద్ర కర్మ కాన్వాయ్‌పై దర్భ ఘాట్ దగ్గర ఎటాక్ చేసిన ఘటనలో 17 మంది జవాన్ల మృతి చెందారు. మహేంద్ర కర్మతో పాటు చత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి విద్యా చరణ్ శుక్లాలను మావోయిస్టులు కాల్చి చంపారు. 2008 సంవత్సరంలో ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులోని మల్కన్ గిరి జిల్లాలో సీలేరు నదిలో బలిమెల వద్ద రాకెట్ లాంచర్లతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపిన మావోయిస్టులు 38 మంది గ్రేహౌండ్స్ జవాన్లను హతమార్చారు.