పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ కి, రాష్ట్ర పార్టీ శాఖ కొత్త చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు మధ్య ‘గ్యాప్’ మరింత పెరుగుతోంది. సిద్దు సోషల్ మీడియాలో తనపై చేసిన విమర్శలకు బహిరంగంగా ఆపాలజీ చెప్పాలన్న సీఎం అమరేందర్ సింగ్ వర్గం డిమాండుపై సిద్దు ఏ మాత్రం స్పందించలేదు. పైగా మరింత ‘పదునెక్కి’.. బలోపేతంగా మారుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన 62 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై.వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గెలిపించి ‘పంజాబ్ మోడల్’ ను ఆవిష్కరించాలని వారికి పిలుపునిచ్చారు. తన నియామకం జరిగిన అనంతరం తొలి రెండు రోజుల్లోనే ఆయన 42 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బుధవారం 62 మందితో భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 117 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి సీఎం అమరేందర్ సహా 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. 2017 లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అమరేందర్ ప్రభుత్వం విఫలమైందని సిద్దు వర్గం ఆరోపిస్తోంది.
ఇక విండ్స్ ఆఫ్ ఛేంజ్…ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్..(గాలి మారుతోంది…ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత) అనే క్యాప్షన్ తో సిద్దూ ట్విట్టర్లో రిలీజైన వీడియోను పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారు. సిక్కుల ప్రయోజనాలను తాను కాపాడుతానంటూ ఈయన పలువురు ఎమ్మెల్యేలను అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయానికి తీసుకువెళ్ళ్లారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు కెప్టెన్ సాబ్.. మరో వైపు ఈ మాజీ క్రికెటర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతారో ఎవరి వ్యూహం పార్టీకి విజయావకాశాలను పెంచుతుందో చూడాల్సిందే..
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలోనే ఎక్కువగా అడవులు ఉన్న దేశాలు ఇవే.. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..