నేడు మేడారం.. నాడు లాతూర్.. భూకంపం విషయంలో ప్రకృతి ముందే హెచ్చరించిందా?

| Edited By: Janardhan Veluru

Dec 04, 2024 | 5:07 PM

Mulugu Earthquake: మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని లాతూర్‌లో వచ్చిన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. చరిత్ర పేజీల్లో నిలిచిపోయింది. సెప్టెంబరు 30, 1993న తెల్లవారుజామున 3:56 గంటల సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం విరుచుకుపడింది. ఇందులో 10 వేల మందికి పైగా మరణించారు.

నేడు మేడారం.. నాడు లాతూర్.. భూకంపం విషయంలో ప్రకృతి ముందే హెచ్చరించిందా?
Medaram And Latur Earthquake
Follow us on

Medaram and Latur Earthquake Incidents: ప్రకృతి వైపరీత్యాల్లో తుఫాన్లు, వర్షాలు, వరదలు, హిమపాతం సహా అనేక రకాల వాతావరణ పరిస్థితులు సహా అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి భౌగోళిక అంశాలపై కూడా కాస్తో, కూస్తో ముందుగానే గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. కానీ భూకంపాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థ భూగోళం మీద ఎక్కడా లేదు. గత శతాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన భూకంపాలు, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి భూకంపాలు ఎక్కువగా సంభవించడానికి ఆస్కారమున్న ప్రాంతాలను మాత్రం గుర్తించవచ్చు. వాటినే మనం వాడుక భాషలో సీస్మిక్ జోన్లుగా వ్యవహరిస్తుంటారు. జోన్-1లో భూకంపాలు సంభవించే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. జోన్-4, జోన్-5లో భూకంపాలు సంభవించడానికి ఆస్కారమూ ఎక్కువే. వాటి కారణంగా జరిగే నష్టమూ ఎక్కువే ఉంటుంది. భారత ఉపఖండంలో గమనిస్తే హిమాలయ పర్వతాలున్న ప్రాంతాలు జోన్-5లో ఉంటాయి. 2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విధ్వంసం ఇప్పటికీ ఉపఖండంలోని ప్రజల కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది.

జోన్-5లో నేపాల్, భూటాన్, చైనా(టిబెట్ ప్రాంతం), పాకిస్తాన్ – అఫ్ఘనిస్తాన్‌లోని కారకోరం పర్వత శ్రేణులు, భారత్‌లోని జమ్ము-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. జోన్-4లో గంగా, సింధు మైదానంలో విస్తరించిన ప్రాంతాలు, రాష్ట్రాలున్నాయి. అయితే వీటికి చాలా దూరంగా.. దక్కను పీఠభూమిపై ఉన్న తెలంగాణలో హైదరాబాద్ సహా చాలా ప్రాంతాలు జోన్-2లో ఉన్నాయి. గోదావరి నదీ లోయ ప్రాంతం మాత్రం జోన్-3లో ఉందని శాస్త్రవేత్తలు వర్గీకరించారు. జోన్-2, జోన్-3లో భూకంపాలు సంభవించే అవకాశాలు అరుదుగానే ఉన్నప్పటికీ, ఒక్కోసారి అవి తీవ్ర విధ్వంసాలను సృష్టించి మానవాళి చరిత్రలో విషాదాలను సృష్టిస్తుంటాయి. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో సంభవించిన భూకంపం (రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా వరకు ప్రకంపనాల తీవ్రత కనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపింతులను చేసింది. అదే సమయంలో గతంలో ఈ ప్రాంతంలో సంభవించిన భూకంపాలను గుర్తుచేసింది.

వైపరీత్యానికి ముందు పరోక్ష సంకేతాలు

మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని లాతూర్‌లో వచ్చిన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించి చరిత్ర పేజీల్లో నిలిచిపోయింది. సెప్టెంబరు 30, 1993న తెల్లవారుజామున 3:56 గంటల సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం విరుచుకుపడింది. ఇందులో 10 వేల మందికి పైగా మరణించారు. మరో 30 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి లాతూర్‌ మాత్రమే కాకుండా చుట్టుపక్కల 12 జిల్లాల్లోని దాదాపు 2 లక్షల 11 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 52 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భూకంప కేంద్రానికి జనసాంద్రత ఎక్కువగా ఉన్న లాతూర్ పట్టణం సమీపంలో ఉండడంతో విధ్వంసం తీవ్రత, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదైంది. ఇంత భారీస్థాయిలో కంపనాలు విరుచుకుపడడానికి కనీసం 6 నెలల ముందు నుంచే ప్రకృతి సంకేతాలు పంపించిందని స్థానికులు చెబుతారు. రికార్డయిన గణాంకాల ప్రకారం ఈ భూకంపం కంటే ముందు లాతూర్, దాని పరిసర ప్రాంతాల్లో 6 నెలల్లో 125 తేలికపాటి ప్రకంపనాలు, భూకంపాలు వచ్చాయి. ఇదంతా ఆగస్టు 1992 – మార్చి 1993 మధ్య జరిగింది.

Latur Earthquake 1993

అంటే ఇక్కడ ఓ భారీ వైపరీత్యం సంభవించబోతుందని ప్రకృతి ముందుగానే హెచ్చరించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. లాతూర్ జిల్లా ఔసా తాలూకా, ఉస్మానాబాద్‌లోని ఉమర్గా తాలూకా భూకంపానికి ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ భూకంపం మహారాష్ట్రను సంక్షోభంలోకి నెట్టింది. ఆ సమయంలో రాష్ట్రానికి దేశ విదేశాల నుండి సహాయం అందింది. ఇది జరిగి 30 ఏళ్లు దాటినప్పటికీ మహారాష్ట్రలో ఆ భూకంప గాయం ఇంకా పచ్చిగానే ఉంది. తాజాగా మహారాష్ట్రకు ఆనుకున్న తెలంగాణలో సంభవించిన భూకంపం మహారాష్ట్ర వాసుల గుండెల్లో గుబులు రేపింది. భూకంపం యొక్క కేంద్రం ఉన్న చోట, ఒకప్పుడు పెద్ద బిలం (అగ్నిపర్వత నోరు) ఉండేదని నమ్ముతారు. ఈ భూకంపం సంభవించినప్పుడు, చాలా మంది ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు, దీని కారణంగా చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

మేడారం భూకంపానికి ముందు…

లాతూరులో సంభవించిన భారీ భూకంపానికి ముందు స్వల్ప భూకంపాలు, ప్రకంపనాలు సంభవించడం ఒక హెచ్చరికలా భావిస్తే.. మేడారం భూకంపానికి ముందు అలాంటి హెచ్చరికలు ఏవైనా వచ్చాయా అన్న ప్రశ్న మొదలైంది. మూడు నెలల క్రితం సెప్టెంబర్ 3న ఇదే ప్రాంతంలో టోర్నడో తరహాలో ప్రఛండ వేగంతో వచ్చిన సుడిగాలి 50 వేలకు పైగా చెట్లను నేల కూల్చింది. వేలాది హెక్టార్ల అడవిని నాశనం చేసింది. సహజంగా టోర్నడోలు అమెరికా వంటి రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంటాయి. కానీ ఆ రోజు మేడారం అడవుల్లో సంభవించింది టోర్నడోనా లేక బలమైన సుడిగాలా అన్న విషయంపై శాస్త్రవేత్తల అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అధ్యయనాల సంగతెలా ఉన్నా.. స్థానిక ప్రజలు మాత్రం ప్రకృతి ముందే హెచ్చరించిందని అభిప్రాయపడుతున్నారు.

Medaram Trees Fall

మేడారం గిరిజన-ఆదీవాసులతో పాటు తెలంగాణలో చాలా మందికి పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడ జరిగే జాతరకు కుంభమేళాను తలపించేలా జనం తరలి వస్తుంటారు. అలాంటి ప్రాంతంలో అడవిని నాశనం చేసిన సెప్టెంబర్ నాటి విపత్తును, తాజాగా సంభవించిన 5.3 తీవ్రత కల్గిన భూకంపంతో ముడిపెడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ రెండు పరస్పర భిన్నమైన అంశాలని స్పష్టం చేస్తున్నారు. సుడిగాలి లేదా టోర్నడో, తుఫాను గాలులు వంటివి భూ ఉపరితలంపై ఉన్న వాతావరణంలో మార్పుల కారణంగా ఏర్పడుతుంటాయి. కానీ భూకంపాలు ఏర్పడేందుకు భూగర్భంలో సంభవించే మార్పులు కారణమవుతాయి. ఈ రెండింటినీ ఒకే గాటన కట్టలేమని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. శాస్త్రవేత్తల నిర్వచనాలు ఎలా ఉన్నా.. ప్రకృతిని దైవంగా భావించే భారతదేశంలో ప్రకృతి నుంచి ఎదురయ్యే ఏ రకమైన విపత్తునైనా ఒక హెచ్చరికలాగే ప్రజలు భావిస్తుంటారు.