
చైనా సహా భారత్ చుట్టుపక్కల దేశాల్లో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఒక వేళ కేసులు ఉధృతమైతే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ మాక్ డ్రిల్‌లో అందుబాటులో ఉన్న బెడ్స్, మానవ వనరులు, ఆక్సిజన్ సప్లై చైన్.. ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సహా అందుబాటులో ఉన్న ఇతర వనరులపై దృష్టి పెట్టాలని సూచించింది. కోవిడ్ సెకెండ్ వేవ్ సమయంలో తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేక తీవ్రమైన ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నర్సులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలను కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగం చెయ్యాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇక విదేశాల నుంచి వచ్చే వారికి ఇప్పటికే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పని సరి చేసింది. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
చైనా విషయానికి వస్తే అక్కడ రోజు రోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయంటూ అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. ఇప్పటికే చైనా చేతులెత్తేసిందని.. ఒమిక్రాన్ వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరిపోయిందని కథనాలను ప్రసారం చేస్తున్నాయి. రోజూ లక్షలాది మందికి వైరస్ సోకుతోంది. అక్కడ కోవిడ్ పరీక్షలు చెయ్యడం కూడా సాధ్యం కావడం లేదు. సరిపడా వైద్య సదుపాయాలు కూడా రోగులు నానాయాతన పడుతున్నారు. జపాన్‌లోనూ రోజు రోజూ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క శనివారం ఒక్క రోజే అత్యధికంగా 371 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2020లో ఈ మహమ్మారి మొదలైన తర్వాత ఈ సంఖ్యలో మరణాలు సంభవించడం జపాన్లో ఇదే తొలిసారి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ విషయంలో తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మన్ కి బాత్‌లో చెప్పారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు తరచు కడుక్కోవాలని సూచించారు. న్యూ ఇయర్ వేడుకలు, పండగలు వస్తున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని సంతోషంగా జరుపుకోవాలని మోదీ కోరారు.
చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ వల్ల తలెత్తినంత తీవ్రత భారత్‌లో ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. చైనాతో పోల్చితే వ్యాక్సీనేషన్ విషయంలో భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉందని.. అందువల్లే చైనాలో ఉన్నంత తీవ్రత ఇండియాలో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..