Mysore Dasara: మైసూర్‌లో అట్టహాసంగా దసరా సంబరాలు.. ప్యాలెస్‌లో ఆయుధ పూజ వేడుకలు

మైసూర్‌ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్‌లో జరిగే ఉత్సవాలు.. ఇలా దసరా పండుగ రారాజు అంటే మైసూర్ అనే చెప్పుకోవాలి. కర్నాటకలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగ దసరా.

Mysore Dasara: మైసూర్‌లో అట్టహాసంగా దసరా సంబరాలు.. ప్యాలెస్‌లో ఆయుధ పూజ వేడుకలు
Mysore Dasara Celebrations

Updated on: Oct 11, 2024 | 9:53 AM

మైసూర్‌ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్‌లో జరిగే ఉత్సవాలు.. ఇలా దసరా పండుగ రారాజు అంటే మైసూర్ అనే చెప్పుకోవాలి. కర్నాటకలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగ దసరా. ఒక్క మైసూరులోనే కాకుండా రాష్ట్రమంతటా ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది. భక్తిభావం ఉప్పొంగుతోంది. శక్తి నామంతో మైసూరు నగరం పులకించి పోతోంది. ఆ.. జగన్మాత సేవ కోసం గజరాజులు సిద్ధమవుతుండగా.. విజయదశమి నాడు నిర్వహించేై ముగింపు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

నాదబ్బ దసరా ఈసారి మైసూరులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవరాత్రులలో 9వ రోజు మైసూరు ప్యాలెస్‌లో ఆయుధ పూజ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు చాముండి తొట్టి వద్ద చండీ హోమం నిర్వహించారు. ఉదయం 6.40 నుండి 7.10 గంటల మధ్య ఆయుధాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధాలను ఏనుగు తలుపు ద్వారా కోడి సోమేశ్వరాలయానికి తీసుకువెళ్లారు. ఇక చాముండేశ్వరీ అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

గత ఏడాది రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడ్డా.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురవడంతో రైతాంగం కుదుటపడింది. అందుకే.. ఈ ఏడాది దసరా వేడుకల్ని మునుపటి కంటే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది కన్నడ సర్కార్. మైసూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది. దాదాపు సగం పోలీసు ఫోర్స్ మైసూర్ మహోత్సవ్ మీదే ఫోకస్.

మైసూరులో సీఎం సిద్ధరామయ్య

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి నుంచి 3 రోజుల పాటు మైసూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం సిద్ధరామయ్య ఈరోజు ఉదయం విమానంలో మైసూర్ చేరుకున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు దసరా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య ఆదివారం ధార్వాడ్, బెల్గాం వెళ్లనున్నారు. సీఎం సిద్ధరామయ్య అక్టోబర్ 12న ఉదయం 10 గంటలకు చాముండి కొండ దిగువన ఉన్న శ్రీ సత్తూరు మఠాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాజభవనంలోని బలరామ ద్వారం వద్ద ఉన్న నంది ధ్వజానికి పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ప్యాలెస్ ఆవరణలోని అంబారీకి పూలమాలలు వేసి జంబూసవరి ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు బన్నిమంటప మైదానంలో ఏర్పాటు చేసిన పంజిన కవాతు కార్యక్రమంలో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..